
బీచుపల్లి ఘాట్‌లో భక్త జనప్రవాహం
కృష్ణానదీ తీరం..జనతీరమైంది. నదీమతల్లి ఒడిలో తనివితీరా సేదదీరారు. పుష్కరుడి సేవలో భక్తులు తరించిపోయారు. జిల్లాలోని పుష్కరఘాట్లకు శనివారం పోటెత్తారు. పుష్కరాల ముగింపు సమయం సమీపిస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కరోజే 27,58,638 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
- కృష్ణమ్మ ఒడిలో తనివీతీరా పుష్కరస్నానాలు
- గొందిమళ్లలో గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ పుష్కర స్నానం
- పలు ఘాట్లకు పెరిగిన వీఐపీల తాకిడి
- నేడు రద్దీ మరింత పెరిగే అవకాశం
- సోమశిల ఘాట్‌లో తగ్గిన నీటిమట్టం..షవర్లకింద స్నానాలు
- జాతీయ రహదారి, సోమశిల రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్
- రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్ ఆయన సతీమణి విమల నరసింహన్ దంపతులు శనివారం జిల్లాలోని గొందిమళ్ల పుష్కరఘాట్‌లో పుణ్యస్నానమాచరించారు. అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రంగాపూర్, గొందిమళ్ల ఘాట్లను సందర్శించారు. గొందిమళ్ల వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించి జోగుళాంబను దర్శనం చేసుకున్నారు.
- మాజీ మంత్రి మాదాల జానకిరాం, ఆదోల్ ఎమ్మెల్యే, సినీనటుడు బాబుమోహన్ జోగుళాంబ ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించి జోగుళాంబ దర్శనం చేసుకున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్ గొందిమళ్లలో పుణ్యస్నానం ఆచరించి జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించారు.
- రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ మంచాలకట్టలో పుణ్యస్నానమాచరించగా, ఐజీపీ మల్లారెడ్డి, వరంగల్ రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు సోమశిల పుష్కరఘాట్‌లో స్నానమాచరించారు.
- రంగాపూర్ పుష్కరఘాట్‌లో మాజీ మంత్రి ముత్యంరెడ్డి, కోరుట్ల శాసనసభ్యుడు విద్యాసాగర్‌రావులు పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ రంగాపూర్ ఘాట్‌లోని ఆర్యవైశ్య అన్నదాన శిబిరాన్ని సందర్శించారు.
ట్రాఫిక్ జామ్..
శనివారం అన్ని పుష్కర ఘాట్లకు భక్తుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ కర్నూల్ జాతీయ రహదారిలోని భూత్పూర్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సోమశిలకు భక్తులు క్యూ కట్టడంతో కర్నూల్ సోమశిల వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అడ్డాకుల టోల్‌గేట్ వద్ద కూడా వాహనాలు నిలిచిపోయాయి.