- అరెస్టైన వారిలో అనంత, గుంటూరు, విశాఖ వాసులు
అనంతపురం సెంట్రల్ :
గుట్టుగా గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్లను అనంతపురం మూడో పట్టణ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. స్థానిక త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను డీఎస్పీ మల్లికార్జునవర్మ మీడియా ఎదుట హాజరుపరిచారు. వారి వివరాలు వెల్లడించారు. అనంతపురం ఆదర్శనగర్‌కు చెందిన ఎరికల నాగన్న, గుంటూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన పసుమర్తి వరప్రసాద్, విశాఖపట్నం జిల్లా చింతలపల్లికి చెందిన వీర్ల సురేశ్, చేనుకుంపాకాలు గ్రామానికి చెందిన గడుతూరి శివచైతన్య అరెస్టైన వారిలో ఉన్నారు.
పట్టుబడింది ఎలాగంటే..
అనంతపురం యువకులు మత్తుపదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనిపై దృష్టి సారించిన త్రీటౌన్ పోలీసులు గతంలో కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు కేవలం బాధితులు మాత్రమేనని గుర్తించి అసలు నిందితుల కోసం లోతుగా దర్యాప్తు సాగించారు. జిల్లాకు గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది, దీని వెనుక ఉన్న ముఠా ఎవరన్న కోణంలో విచారణ ప్రారంభించారు.
విశాఖ జిల్లాలోని నర్సీపట్నం, చింతపల్లి, పాడేరు తదితర ప్రాంతాల్లో గంజాయిని కుటీర పరిశ్రమగా సాగు చేసి, అక్కడి నుంచి ఆర్డర్లపై అనంతపురం, కర్నూలు, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇంకా మహారాష్ట్ర, ఢిల్లీ, హరిద్వార్, హైదరాబాద్ తదితర నగరాలకూ ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం రాబట్టారు. అయితే ఇదంతా ఒక ముఠా ముందుండి నడిపిస్తోందని పసిగట్టిన పోలీసులు ముఠా కోసం గాలించారు. పైన పేర్కొన్న నలుగురు మహదేవనగర్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఉన్నట్లు అందిన సమాచారం మేరకు వలపన్ని పట్టుకున్నారు. వారి నుంచి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.