తాను చదివింది ఏడో తరగతి.. అయినా విదేశాల్లో డాక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఉన్నత చదవులు చదివిన ఎందరో వైద్యులకు కుచ్చుటోపీ పెట్టాడో మోసగాడు.
పెద్దాపురం (తూర్పుగోదావరి): తాను చదివింది ఏడో తరగతి.. అయినా విదేశాల్లో డాక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఉన్నత చదవులు చదివిన ఎందరో వైద్యులకు కుచ్చుటోపీ పెట్టాడో మోసగాడు. చివరికి పెద్దాపురంలో పోలీసులకు చిక్కాడు. వివరాలు.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన 39 ఏళ్ల నంబూరి రవి ఏడో తరగతిలోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఆన్‌లైన్‌లో తేజస్విని కన్సల్టింగ్ పేరిట ఒక వెబ్‌సైట్‌ను సృష్టించి, తనకు విదేశాల్లో క్లైంట్లు ఉన్నారని, అక్కడ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో డాక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని వైద్యులకు ఎర వేశాడు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.9 వేలు తన బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని షరతు పెట్టాడు. దేశవ్యాప్తంగా ఎంతోమంది డాక్టర్లు అతడిని నమ్మి మోసపోయారు.
అయితే ఖమ్మం జిల్లాకు చెందిన బట్టు శ్రీనివాసరావు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలలో చదువుకున్న దాదాపు పది మంది వైద్యులు కూడా తాము రవి చేతిలో మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం పెద్దాపురం ఏడీబీ రోడ్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న రవిని ఎస్సై వై.సతీష్ అరెస్టు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపడుతున్నామని, దేశవ్యాప్తంగా రవి చేతిలో ఎంతమంది మోసపోయినదీ ఆరా తీస్తున్నామని ఎస్సై తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు రూ.9 లక్షలు వసూలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.