
సీపీఎస్ రద్దుకు ఉద్యమం
కడప ఎడ్యుకేషన్:
ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 19న చలో దిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి తెలిపారు. గురువారం కడపలోని ఎస్టీయూ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు ర ఘునాథరెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసే విషయమై రాష్ట్రపతి, ప్రధానమంత్రులను కలువనున్నట్లు తెలిపారు. అలాగే దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా కూడా చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే ఏకీకృత సర్వీస్‌లు, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ ఈఓ పోస్టులను కూడా తక్షణం భర్తీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.