![అధిక ఫీజులను అరికట్టాలని వీసీ చాంబర్ ముట్టడి](/styles/webp/s3/article_images/2017/09/5/41483997640_625x300.jpg.webp?itok=YEkc0A9a)
అధిక ఫీజులను అరికట్టాలని వీసీ చాంబర్ ముట్టడి
ఎంజీ యూనివర్సిటీ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నారని ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం యూనివర్సిటీ వీసీ చాంబర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నీరూటి రమేష్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం విడుదల చేస్తున్నప్పటికీ విద్యార్థుల నుంచి బలవంతంగా కళాశాలలు ఫీజులు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజులు కూడా తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా యూనివర్సిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులు లేకపోయినా, కనీస సౌకర్యాలు లేకపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పేర్కొన్నారు. క్రీడా పోటీల పేరిట యూనివర్సిటీ వసూలు చేసిన లక్షల రూపాయలు ఏం చేశారో లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థుల సమస్యలను వీసీ అల్తాఫ్ హుస్సేన్‌కు వివరించారు. దాంతో ఆయన మాట్లాడుతూ సమస్యలు తన దృష్టికి రాలేదని, అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా నాయకులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. దాంతో భారీ ఎత్తున పోలీసులు మొహరించారు. ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఆ తర్వాత వదిలేశారు.