వాయిదా పంచాయితీ
Published Thu, May 25 2017 1:09 AM | Last Updated on Tue, Aug 21 2018 7:34 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఇరగవరం ఎస్సై కేవీ శ్రీనివాస్, రైటర్ ఎస్.ప్రదీప్‌కుమార్‌ను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నిర్బంధించిన అనంతరం తలెత్తిన పరిణామాలను చక్కదిద్దే విషయంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో జిల్లా ఎస్పీని బదిలీ చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలకు చంద్రబాబునాయుడు బుధవారం కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై సీఎం సమక్షంలో జరగాలి్సన పంచాయితీ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ముఖ్యమంత్రి బుధవారం హైదరాబాద్ వెళ్లడం వల్ల ఎమ్మెల్యేలను కలవడానికి సమయం కుదరలేదని సీఎం కార్యాలయం నుంచి వారికి సమాచారం అందింది. బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో చంద్రబాబు గురువారం భేటీ కానున్నారు. అనంతరం కలెక్టర్లతో సమావేశమవుతారు. ఆ తరువాత మహానాడు ఉండటంతో జిల్లా ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇచ్చే అవకాశం కనపడటం లేదు. ఇప్పటికే ఈ అంశంపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో ఆయనతో భేటీ రద్దవడంతో జిల్లా ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ముఖ్యమంత్రి క్లాస్ పీకినట్టు ప్రచారం. జిల్లా అధికారులతో గొడవలు ఏమిటి, ఒక అధికారిని నిర్బంధించడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు, 15 మందిని గెలిపించిన జిల్లాలో మనం ప్రవర్తించాల్సింది ఇలాగేనా, ఇన్‌చార్జి మంత్రిగా మీరేం చేశారని ప్రత్తిపాటి పుల్లారావుకు చంద్రబాబు తలంటినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యేలు ఈ అంశంపై మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. మరో వైపు పోలీసులు మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. పెనుగొండ సీఐను సస్పెండ్ చేయడం ద్వారా తాము ఏ మాత్రం వెనక్కి తగ్గలేదనే విషయాన్ని స్పష్టం చేశారు.
Advertisement