అదును తప్పుతోంది!
అదును తప్పుతోంది!
Published Wed, Jul 20 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
వరుణుడు పలకరిస్తున్నా నిండని ‘ఏలేరు’
పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు
ప్రస్తుత నీటినిల్వలు 2.87 టీఎంసీలే
53 వేల ఎకరాల్లో సాగుపై సందిగ్ధత
నాట్లు వేసేందుకు దగ్గర పడుతున్న సమయం
ఆందోళన చెందుతున్న రైతులు
జగ్గంపేట : తొలకరి చినుకులు పలకరించడంతో ఏరువాక చేపట్టిన ‘ఏలేరు’ రైతన్న.. నాట్లు వేయాలో లేదో అర్థంకాని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. జలాశయంలో చాలినన్ని నీటినిల్వలు లేకపోవడమే ఇందుకు కారణం. ఖరీఫ్‌నాటికి జలకళతో కళకళలాడాల్సిన ఏలేరు జలాశయంలో ప్రస్తుతం 2.87 టీఎంసీల నీటినిల్వలు మాత్రమే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నా.. ఏలేరు క్యాచ్‌మెంట్ ఏరియాలో వరుణుడి కరుణ అంతగా కానరావడంలేదు. దీంతో రోజుకు సరాసరి 350 క్యూసెక్కుల వరకూ మాత్రమే ఇ¯Œæఫ్లో ఉంటోంది. మరోపక్క ఖరీఫ్‌కు అదును దాటుతూండడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నారుమడులు వేసుకుని, నాట్లు వేసేందుకు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఏలేరు జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు. దీనికింద 67 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా వాస్తవానికి 53 వేల ఎకరాలే సాగవుతోంది. ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకర్గాల పరిధిలోని ఏడు మండలాల రైతులు ఏలేరు ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఖరీఫ్‌తో పాటు రబీ కూడా సాగు చేసే ఏలేరు రైతులు ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన చెందుతున్నారు. నెలాఖరులోగా నాట్లు వేస్తే దిగుబడి బాగుంటుందని, ఆలస్యమైతే దిగుబడి తగ్గి నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు.
దమ్ములు చేపట్టలేదు
ఏలేరు ఆయకట్టు కింద ఖరీఫ్ దమ్ములు చేపట్టలేదు. నాట్లు ఆలస్యమవుతున్నాయి. అధికారులు స్పందించి వెంటనే నీరు విడుదల చేయాలి.
కొటారి సూరిబాబు, రైతు, కిర్లంపూడి
నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి
ఏలేరును ఆధునికీకరించి ఉంటే ప్రాజెక్టులో నీరు ఉండేది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఏలేరుకు ఈ దుస్థితి ఏర్పడింది. వెంటే ఆధునికీకరించి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరివ్వాలి.
చిక్కాల చిన్న, రైతు, కిర్లంపూడి
నాట్లకు నీరివ్వాలి
అదును తప్పుతున్నందున ఏలేరు కింద నాట్లు వేసుకునేందుకు వెంటనే నీరు విడుదల చేయాలి. నీరు ఆలస్యమైతే సాగుపై ప్రభాపం చూపి నష్టపోతాం.
దోమాల వెంకన్న, రైతు, వేలంక
Advertisement
Advertisement