వ్యవసాయ యంత్రాలు ముందుగానే ఇవ్వండి
ఏలూరు (మెట్రో): వ్యవసాయ యంత్రాలు అందించడంలో జిల్లా వ్యవసాయ అధికారులు శ్రద్ధ వహించి రాబోయే రబీ సీజన్‌కు ఇప్పటి నుంచే పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్ కె.భాస్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రాధాన్యతా రంగాల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాంత్రీకరణలో భాగంగా ఏ మేరకు యంత్రాలు అందుతున్నాయో, ఏ యంత్రాలు ఇస్తున్నారో అనే విషయాలు నూరు శాతం రైతులకు తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
ఈ విషయాలు ప్రతి ఒక్క రైతుకూ తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పోస్ యంత్రాల ద్వారా ఎరువులు, పురుగు మందులు సక్రమంగా రైతులకు చేరేలా చూడాలన్నారు. డీలర్లు ఈ పోస్ యంత్రాల ద్వారా ఎరువులను పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. లక్ష్యాలను త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని పట్టు పరిశ్రమశాఖ డెప్యూటీ డైరెక్టర్ సుబ్బరామయ్యను ఆదేశించారు. అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, లీడ్‌బ్యాంకు మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, డీసీవో లూథర్ పాల్గొన్నారు.