మళ్లీ రెయిన్‌గన్లు!
మళ్లీ రెయిన్‌గన్లు!
Published Wed, Oct 26 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
- విఫలమైనా అదే ప్రయోగం
- విమర్శలకు తావిస్తున్న ప్రభుత్వ చర్యలు
- కంది, వరి పంటల కోసం ప్రతిపాదనలు
- వివరాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది
- గురువారం సాయంత్రానికి నివేదిక సిద్ధం
గతంలో ఇలా..
గతంలో రెయిన్‌గన్ల ద్వారా తడిపిన భూమి: 65 వేల హెక్టార్లు
ఇందుకోసం వెచ్చించిన మొత్తం: రూ. 28 కోట్లు
ఇప్పటికే రూ.25 కోట్లు మంజూరు కాగా...ఇంకా రూ.3 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇంత ఖర్చు చేసినా..ఒక్క ఎకరా పంటను కూడా కాపాడలేకపోయారనే విమర్శలు ఉన్నాయి.
ప్రస్తుతం ఇలా..
జిల్లాలో అక్టోబరు నెల సాధారణ వర్షపాతం: 114. మిమీ
ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం: 9 మి.మీ
మరో వారం రోజుల్లో వర్షాలు పడకపోతే కంది పూర్తిగా ఎండిపోతుంది.
పత్తి, వరి పంటలుదీ అదే పరిస్థితి.
ఈ నేపథ్యంలో నిర్దిష్టంగా పంటలను కాపాడే ప్రణాళికలు లేకుండా..
విఫలమైన రెయిన్‌గన్లను మళ్లీ తెరపైకి తీసుకురావడం విమర్శలకు తావిస్తోంది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పంటలను కాపాడేందుకు రెయిన్‌గన్ల వినియోగాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తీసుకొస్తోంది. ఖరీఫ్ సీజనులో వేసి ఇంకా మిగిలి ఉన్న కంది, పత్తి, వరి పంటలను కాపాడేందుకే రెయిన్‌గన్లను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏయే పంటలు ఏయే దశలో ఉన్నాయి? ఎంత విస్తీర్ణంలో ఉంది? ఇందుకోసం ఎన్ని రెయిన్‌గన్లు కావాలనే వివరాలను సమర్పించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం (27వ తేదీ) సాయంత్రం జిల్లా కలెక్టర్‌కు వ్యవసాయశాఖ అధికారులు నివేదిక సమర్పించేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి గతంలో ఒకసారి హడావుడిగా రెయిన్‌గన్లను ఉపయోగించి పంటలను కాపాడతామంటూ భారీగా నిధులు వెచ్చించినప్పటికీ ఫలితంలేకపోయింది. అయినప్పటికీ మరోసారి రెయిన్‌గన్లను ఉపయోగించేందుకు సిద్ధపడుతుండటం విమర్శలకు తావిస్తోంది.
కంది, వరి కోసం ప్రతిపాదనలు
జిల్లాలో ఖరీఫ్ సీజనులో వేసిన కంది, పత్తి, వరి పంటలు ఇప్పుడు ఎండుముఖం పట్టాయి. ప్రధానంగా కెసి కెనాల్‌కు నీరు రాకపోవడంతో వరి పంట పరిస్థితి దారుణంగా ఉంది. కెసీ కెనాల్‌లో ఒక అడుగు నీరు మాత్రమే ఉంది. ఈ నీరు తూములకు ఎక్కే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ నీటిని రెయిన్‌గన్ల ద్వారా వరి పంటలకు తడిపేందుకు అనుమతి ఇవ్వాలని వ్యవసాయశాఖ కోరనున్నట్టు తెలిసింది. ఇక పత్తి పంటలను రెయిన్‌గన్ల ద్వారా తడిపితే ఉపయోగం లేదని కూడా వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు. కంది పంట జిల్లావ్యాప్తంగా లక్ష హెక్టార్లల్లో సాగయ్యింది. పత్తి పంట విషయానికి వస్తే లక్షా 63 వేల హెక్టార్లు, వరి 67 వేల హెక్టార్ల మేరకు సాగయ్యింది. ఇందులో ఇప్పుడు ఎంత మేరకు పంట ఎండుముఖం పట్టిందనే వివరాలను సేకరించే పనిలో వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు. ఇందుకు అనుగుణంగా ఎన్ని రెయిన్‌గన్లు అవసరంమనే అంశాన్ని కూడా సమర్పించే నివేదికలో పేర్కొననున్నారు. గురువారం సాయంత్రానికి నివేదిక సిద్ధమవుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
రూ. 28 కోట్లు ఖర్చు చేసినా...!
గత నెలలోనే మొదటిసారిగా ప్రభుత్వం రెయిన్‌గన్లను భారీగా ఉపయోగించడం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రెయిన్‌గన్ల వినియోగానికి ప్రభుత్వం మూడు వందల కోట్లకుపైగా నిధులను ఖర్చు చేసింది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 65 వేల హెక్టార్లను రెయిన్‌గన్ల ద్వారా తడిపామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ. 28 కోట్లు మేరకు వెచ్చించారు. ఇందులో రూ.25 కోట్లు ఇప్పటికే మంజూరు కాగా...ఇంకా రూ.3 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ఒక్క ఎకరా పంటను కూడా కాపాడలేకపోయారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ మరోసారి రెయిన్‌గన్లను తెరమీదకు తీసుకరావడం అనుమానాలకు తావిస్తోంది. నిర్దిష్టంగా పంటలను కాపాడేందుకు దీర్ఘకాలంలో చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక రచించకుండా తాత్కాలిక పనుల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేయడం ఏమిటని రైతులు వాపోతున్నారు.
Advertisement