
కాలిబాటలతో బహుళ ప్రయోజనాలు
వరినారు నాటే సమయంలో పొలంలో కాలిబాటలు తీయడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్ తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్ : వరినారు నాటే సమయంలో పొలంలో కాలిబాటలు తీయడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్ తెలిపారు. లేత పైరు, కాలిబాటలు వంటి వాటితో పాటు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అనుకున్న పంట దిగుబడులు సాధించవచ్చన్నారు.
ముందస్తు చర్యలు : నాట్లు వేయడానికి 15 రోజుల ముందుగానే పొలాన్ని దమ్ము చేయడం ప్రారంభించి రెండు మూడు దఫాలుగా మురగబెట్టాలి. పొలమంతా సమానంగా చెక్కతోకాని ఇతరత్రా పరికరంతో చదును చేసుకోవాలి. పశువుల ఎరులు, ఇతరత్రా ఆకులు లాంటివి మురగబెట్టినా, లేదంటే జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ల పైర్లు వేసి పూతకు రాకమునుపే పొలంలో కలియదున్నడం వల్ల భూసారం బాగా పెరుగుతుంది.
నాట్లు : నారు తీసే సమయంలో మొక్కలు లేత ఆకుపచ్చగా ఉండాలి. నాలుగు నుంచి ఆరు ఆకులున్నపుడు నాటాలి. ముదురు నారు నాటితే దిగుబడులు తగ్గుతాయి. చదరానికి 33 మూనలు ఉండేలా నాటుకోవాలి. ప్రతి 2 మీటర్ల నాట్లకు 20 సెంటీమీటర్లు కాలిబాటలు తీయడం వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి తగ్గుతుంది. కాలిబాటలు తీసుకోవడం ప్రతి రైతూ చేసుకోవాలి. భూసారం అధికంగా ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్లు, తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్లు ఉండేలా నాటాలి. ముదురు నారు నాటినపుడు కుదుళ్ల సంఖ్య పెంచి, కుదురుకు నాలుగైదు మొక్కలు నాటాలి. అలా నాటినపుడు నత్రజని మామూలుగా వేసేదాని కన్నా 25 శాతం ఎక్కువ వేయాలి. నీరు తక్కువగా పెట్టి నాట్లు వేసుకోవాలి.
ఎరువులు : ఎకరాకు 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ అవసరం. నత్రజనిని మూడు భాగాలుగా చేసి దమ్ము, దబ్బు, అంకురం దశలో వేసుకోవాలి. భాస్వరం ఒకేసారి వేసుకోవాలి. పొటాష్ ఎరువును రేగడి నేలల్లో ఒకేసారి, తేలికపాటి నేలల్లో సగం దమ్ము సమయంలోనూ మిగతా సగం అంకురం దశలో వేయాలి.
కలుపు నివారణ : నాటిన మూడు నాలుగు రోజుల్లోగా నీరు పలుచన చేసి ఎకరాకు ఒక లీటర్ బుటాక్లోర్ లేదా అర లీటర్ ప్రెటిటాక్లోర్ లేదా అర లీటర్ అలిలోఫాస్ 10 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లితే కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు. నాటిన 15 నుంచి 20 రోజుల సమయంలో ఎకరాకు 50 గ్రాములు ఇథార్స్‌సల్యురాన్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నాట్లు వేసిన రెండు నుంచి ఆరు వారాల్లో పైరు సరిగా ఎదగక జింకులోపం రావచ్చు. ముదురాకు చివర్లో, మధ్య అనెకు ఇరువైపులా తుప్పు మచ్చలు లేదా ఇటుక రంగు మచ్చలు కనబడుతాయి. దీని నివారణకు 2 గ్రాములు జింక్‌సల్ఫేట్ లీటరు నీటికి కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి.