వాణిజ్యపంటగా మునగ సాగు | agriculture story | Sakshi
Sakshi News home page

వాణిజ్యపంటగా మునగ సాగు

Published Fri, Jan 13 2017 9:50 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

వాణిజ్యపంటగా మునగ సాగు - Sakshi

వాణిజ్యపంటగా మునగ సాగు

అనంతపురం అగ్రికల్చర్‌ : సమగ్ర యాజమాన్య పద్ధతులతో మునగను వాణిజ్య పంటగా మార్చుకోవచ్చునని ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్‌ ఎస్‌.చంద్రశేఖర్‌గుప్తా తెలిపారు. మునగ ఆకులు, కాయల్లో విటమిన్‌ ఏ,బీ,సీ, మెగ్నిషియం, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇటు ఆహారానికి, అటు ఆరోగ్యానికి ఇవి ప్రయోజకరం.

అనువైన నేలలు–విత్తనాలు..
జిల్లాలో ఉన్న పొడి వాతావరణం పంట సాగుకు అనుకూలం. కానీ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉంటే పూత రాలిపోయే అవకాశం ఎక్కువ. 35 నుంచి 40 డిగ్రీలలోపు వాతావరణం అనువుగా ఉంటుంది. అన్నిరకాల నేలల్లో పండించవచ్చు. మునగలో ఏకవార్షిక, బహువార్షిక రకాలు అందుబాటులో ఉన్నాయి. జాఫ్నా అనేది బహువార్షిక రకం.. మెత్తని గుజ్జుతో కాయలు రుచికరంగా ఉంటాయి. ఇంది రెండో సంవత్సరం నుంచి కాపుకు వస్తుంది. మొదటి రెండు సంవత్సరాలు కాయలు కొంచెం తక్కువగా వచ్చినా ఆ తర్వాత ఎక్కువగా కాస్తాయి. పీఎంకే–1 రకం మొక్కలు 4 నుంచి 6 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. నాటిన 100 రోజుల్లో పూతకు వస్తుంది. మొదటి కోత 160–170 రోజులకు వస్తుంది. కాయ సుమారుగా 70 సెంటిమీటర్ల పొడవుగా, 150 గ్రాముల బరువుతో ఉంటుంది. సంవత్సరానికి ఒక చెట్టుకు 200–225 కాయలు వస్తాయి. వీటితో పాటు మరికొన్ని విత్తన రకాలు అందుబాటులో ఉన్నాయి.

యాజమాన్యం:
మునగ విత్తనాలను నేరుగా నేలలో గానీ, పాలిథీన్‌ సంచుల్లోగాని విత్తుకోవచ్చు. పాలిథీన్‌ సంచులలో పశువుల ఎరువు, ఎర్రమట్టి, ఇసుక సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ కలిపిన మిశ్రమంతో నింపాలి. మురుగు నీటి సౌకర్యం కలిగించటానికి పాలిథీన్‌ సంచుల అడుగున రెండు రంధ్రాలు చేయాలి. కార్బండిజమ్‌తో విత్తనశుద్ధి చేసి ఒక్కో సంచికి ఒక విత్తనం పెట్టాలి. విత్తనం 6–10 రోజులకు మొలకెత్తుతుంది. 15–20 సెం.మీ ఎత్తు పెరిగిన తర్వాత 30–35 రోజులకు మొక్కలను ప్రధాన పొలంలో నాటాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8–10 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి లేదా గుంతలను తీసి, గుంతకు 10 కిలోల పశువుల ఎరువుతో పాటు, 250 గ్రాములు వేపపిండి, 250 గ్రాములు సూపర్‌ ఫాస్ఫేటు వేయాలి.

నాటిన వెంటనే నీరు కట్టాలి.  పూత, పిందె సమయంలో ఐదారు రోజులకోసారి నీరు ఇవ్వాలి. లేదంటే పూత రాలిపోతుంది. మిగతా సమయంలో వాతావరణాన్ని బట్టి నేల స్వభావాన్ని బట్టి 15 నుంచి రోజులకో తడి ఇవ్వాలి. మొక్కల మధ్య కలుపు లేకుండా చూసుకోవాలి. మొక్కలు 75–100 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన తర్వాత చివర్లు తుంచివేయాలి. ఈ విధంగా పక్క కొమ్మలు వచ్చి కాపు ఎక్కువగా వస్తుంది. పక్క కొమ్మలు కూడా కొంత పెరిగిన తర్వాత చివర్లు తుంచితే మొక్కలు గుబురుగా పెరిగి ఎక్కువ పూత, కాయ వస్తుంది. అంతర పంటగా కూడా వేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement