అనంత భూముల్లో సేంద్రియ కర్బనం తక్కువ
– పశువుల ఎరువు, వర్మీ, ప్రకృతి వ్యవసాయం శరణ్యం
– 67,500 మట్టి పరీక్షలకు సాయిల్‌హెల్త్ కార్డుల పంపిణీ
– భూసార పరీక్షా కేంద్రం ఏడీఏ ఎం.కృష్ణమూర్తి వెల్లడి
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఉన్న ఎర్రనేలలు, నల్లరేగడి భూముల్లో దాదాపు 80 శాతం మేర సేంద్రియ కర్బనం తక్కువగా ఉందని స్థానిక భూసార పరీక్షా కేంద్రం సహాయ సంచాలకులు ఎం.కృష్ణమూర్తి తెలిపారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల ఎరువుతో పాటు వర్మీకంపోస్టులు, వేప, కానుగ లాంటి వృక్ష సంబంధిత ఎరువులు, అలాగే జనుముల, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట ఎరువులు వేయడంతో పాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తే సేంద్రియ కర్బనం పెరిగే అవకాశం ఉందన్నారు.
1.63 లక్షల మట్టి పరీక్షలు :
విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూసారం తగ్గిపోవడం జరుగుతోంది. ఈ క్రమంలో పంట దిగుబడులు తగ్గిపోవడంతో పాటు రైతులకు పెట్టుబడి భారం పెరిగిపోతోంది. దీంతో ఇటీవల మట్టి పరీక్షలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 2014లో 30,350 మట్టి పరీక్షలు, 2015లో 65,500, 2016లో 67,500.. ఇలా గత మూడేళ్ల కాలంలో 1,63,350 మట్టి పరీక్షలు నిర్వహించారు. 25 ఎకరాలను ఒక గ్రిడ్‌గా విభజించి గత మూడేళ్లలో 5.10 లక్షల మంది రైతులకు మట్టి పరీక్షలకు సంబంధించిన ఫలితాలు, ఎలాంటి ఎరువులు వాడాలనే సిఫారసులు చేస్తూ సాయిల్ హెల్త్‌కార్డులు (భూసార పత్రాలు) అందజేశారు. ఈ క్రమంలో రైతుల్లో కొంత మార్పు వచ్చినట్లు కనబడుతోంది. గతంలో పోల్చిచూస్తే ప్రస్తుతం 10 నుంచి 15 శాతం రసాయన ఎరువుల వినియోగం తగ్గినట్లు కనబడుతోంది. ఇది మంచి పరిణామంగా భావించి రైతుల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి అన్ని అవకాశాలను వ్యవసాయశాఖ వినియోగించుకుంటోంది. భూసార పరీక్షల ప్రాధాన్యతను రైతులు ఇపుడిప్పుడే గుర్తిస్తూ ఇటీవల కాలంలో రైతులే స్వచ్ఛందంగా మట్టినమూనాలు తీసుకువస్తున్నారు.
సేంద్రియ కర్బనం, నత్రజని, జింక్ తక్కువే :
గత మూడేళ్లుగా చేసిన మట్టిపరీక్షలు, వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తే నత్రజని, జింక్, సేంద్రియ కర్బనం చాలా తక్కువగానే ఉన్నాయి. భూసారం పెరగడానికి, పంట దిగుబడులు పెరగడానికి అవసరమైన సేంద్రియ కర్బనం దాదాపు 80 శాతం భూముల్లో తక్కువగానే ఉంది. నత్రజని శాతం తక్కువగా ఉండగా జింక్, బోరాన్ లాంటి సూక్ష్మపోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్) 26 నుంచి 30 శాతం మేర తక్కువ ఉన్నట్లు స్పష్టమవుతోంది. భాస్వరం, పొటాష్ లాంటివి సాధారణంగా, కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న భూసారం, పంటల దిగుబడులు పెరిగి వ్యవసాయం రైతులకు లాభసాటి కావాలంటే పెట్టుబడి లేని వ్యవసాయం (జీరోబేస్డ్ ఫార్మింగ్), ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం (నాచురల్ ఫార్మింగ్), పురుగు మందులు లేని వ్యవసాయం (నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్) లాంటి పద్ధతులు అవలంభించాలి.
ఒకరకంగా చెప్పాలంటే ఈ రకం వ్యవసాయం మన పెద్దలు, పూర్వీకులు చేసిన సేద్యపు పద్ధతులే. మరోసారి అలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తే కాని వ్యవసాయం మనుగడ సాధ్యం కాదు. అలాగే పశువుల ఎరువు, వర్మీ, వేప, కానుగ, పచ్చిరొట్ట ఎరువులు వాడితే సేంద్రియ కర్బనం శాతం పెరుగుతుంది. జింక్‌సల్ఫేట్, జిప్పం, బోరాన్ లాంటి సూక్ష్మపోషకాలు పంటలకు వేయాలి. రసాయన ఎరువులు బాగా తగ్గించాలి. భూసార పత్రాల్లో సిఫారసు చేసిన విధంగా సమగ్ర సమతుల్య ఎరువుల వాడకం చేపట్టాలి. ప్రాంతాల వారీగా నేల స్వభావాన్ని బట్టి అధికారులు, శాస్త్రవేత్తల సిఫారసు మేరకు ఎరువులు వేస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది.