‘ఆగస్టు’ యాజమాన్యంతో అధిక దిగుబడి | agriculture story | Sakshi
Sakshi News home page

‘ఆగస్టు’ యాజమాన్యంతో అధిక దిగుబడి

Published Sun, Aug 13 2017 10:35 PM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM

‘ఆగస్టు’ యాజమాన్యంతో అధిక దిగుబడి - Sakshi

‘ఆగస్టు’ యాజమాన్యంతో అధిక దిగుబడి

- కూరగాయల తోటల్లో సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
- కళ్యాణదుర్గం కేవీకే కోఆర్డినేటర్‌ జాన్‌సుధీర్‌


అనంతపురం అగ్రికల్చర్‌: ఆగస్టు యాజమాన్యంతో కూరగాయల పంటలకు ఆశించిన చీడపీడలు, తెగుళ్లు నివారించుకోవచ్చని కళ్యాణదుర్గం కృషి విజ్ఙాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడి సాధించొచ్చని అన్నారు. కూరగాయల పంటల్లో సస్యరక్షణ చర్యలు, ఆగస్టు యాజమాన్యం, తెగుళ్ల నివారణ తదితర విషయాలను వారు తెలియజేశారు.

కాయతొలుచు పురుగు నివారణ ఇలా..
+ వంగ, బెండలో మొవ్వ, కాయతొలుచు పురుగు నివారణకు తలవాల్చిన కొమ్మలు తుంచేసి, పుచ్చుపట్టిన కాయలు ఏరి నాశనం చేయాలి. తర్వాత 3 మి.లీ రైనాక్సిఫైర్‌ లేదా స్పైనోసాడ్‌ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
+ టమాటలో ఆకుమాడు తెగులు (అర్లీబ్లైట్స్‌) ఆశిస్తే ఆకులు, కాండం, కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి క్రమేణా మాడి ఎండిపోతాయి. తేమ ఉన్నప్పుడు, చల్లని వాతావరణం తెగులు రావడానికి అనుకూలం. నివారణకు 3 గ్రాములు కాప్టాన్‌ లేదా మాంకోజెబ్‌ లేలా 2 గ్రాములు క్లోరోథలోనిల్‌ లేదా 1 మి.లీ ప్రొపికొనజోల్‌ లీటర్‌ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో మూడు లేదా నాలుగు సార్లు పిచికారీ చేసుకోవాలి. టమాటలో పచ్చదోమ ఆశిస్తే ఆకుల అడుగు భాగం నుంచి రసంపీల్చడం ద్వారా ఆకు చివర్లు పసుపు పచ్చగా మారి క్రమేణా ఆకు అంతా ఎర్రబడి ముడుచుకునిపోతాయి. నివారణకు 2 మి.లీ డైమిథోయేట్‌ లేదా మిథైట్‌ డెమటాన్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

+ మిరప నారు నాటేందుకు అనువైన సమయం : ఆరు వారాల వయస్సున్న నారును ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. హైబ్రిడ్‌ రకాలైతే పాదుకు ఒక మొక్క, సూటి రకాలైతే పాదుకు రెండు మొక్కలు పెట్టుకోవాలి. నారుమడిలో అలాగే ఎదపెట్టిన పొలాల్లో నారుకుళ్లు తెగులు నివారణకు 3 గ్రాములు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లీటర్‌ నీటికి కలిపి భూమి బాగా తడిచేలా పిచికారీ చేయాలి. కొయనోఫారా ఎండుతెగులు నివారణకు 30 గ్రాములు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ + 1 గ్రాము స్ట్రెప్లోసైక్లిన్‌ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
+ ఉల్లి సాగు చేసే రైతులు పొలాన్ని నాలుగైదు సార్లు దుక్కి చేసుకోవాలి. 30 సెంటీమీటర్ల ఎడంలో బోదెలు చేసుకొని రెండు వైపులా నాటుకోవచ్చు. 1 శాతం బోర్డోమిశ్రమంలో ముంచి నారును నాటడం వల్ల నారుకుళ్లు తెగులును నివారించుకోవచ్చు. సాధ్యమైనంత మేర ఆగస్టు 15వ తేదీలోపు నాటుకోవడం ఉత్తమం. తామర పురుగుల నివారణకు 2 మి.లీ డైమిథోయేట్‌ లేదా 2 మి.లీ ఫిప్రొనిల్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement