ఆగుతూ సా..గుతూ | aguthu.. saguthu | Sakshi
Sakshi News home page

ఆగుతూ సా..గుతూ

Published Wed, May 10 2017 12:24 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

ఆగుతూ సా..గుతూ - Sakshi

ఆగుతూ సా..గుతూ

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం అడుగు ముందుకు.. 
రెండడుగులు వెనుకకు అన్నచందంగా తయారైంది. 
పనులను వేగవంతం చేయాల్సిన తరుణంలోనూ ఆగుతూ.. సా..గుతున్నాయి. వాతావరణ పరిస్థితుల పరంగా 
కలిసివచ్చే ప్రస్తుత సీజన్‌ లోనూ అనుకున్న స్థాయిలో పనులు ముందుకు సాగటం లేదు. బిల్లు చెల్లింపుల్లో జాప్యమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
పోలవరం : పోలవరం ప్రాజెక్ట్‌కు సంబం ధించి స్పిల్‌ వే నిర్మాణ ప్రాంతంలో మట్టి తొలగింపు పనులు (ఎర్త్‌ వర్క్స్‌) పడకేశాయి. గతంతో పోలిస్తే రోజువారీ పనులు సగానికి పడిపోయాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందుల కారణంగా సబ్‌ కాంట్రాక్టర్లు పనులను నామమాత్రంగా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రధాన కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ట్రాన్స్‌ ట్రాయ్‌ సంస్థ సబ్‌–కాంట్రాక్టర్‌ అయిన త్రివేణి సంస్థకు పెద్దమొత్తంలో బిల్లుల్ని బకాయిపడింది. మిగిలిన సబ్‌–కాంట్రాక్టర్లకు సైతం బిల్లు చెల్లింపులు చేయడం లేదు. త్రివేణి ఆధ్వర్యంలో పనులు చేస్తున్న చిన్నపాటి కాంట్రాక్టర్లకు ఆ సంస్థ సైతం బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితుల వల్ల నెల రోజులుగా స్పిల్‌ వే నిర్మాణ ప్రాంతంలో మట్టి తొలగింపు పనులు పడకేశాయి. 
అలా అలా.. కానిస్తున్నారు
స్పిల్‌ వే నిర్మాణంలో భాగంగా కాంక్రీట్‌ పనులకు ఇబ్బందులు కలగకుండా మాత్రమే మట్టి తొలగింపు పనులను చేపట్టగా.. అవికూడా లక్ష్యం మేరకు సాగటం లేదు. నెల క్రితం వరకు రోజుకు 1.80 లక్షల క్యూబిక్‌ మీటర్ల నుంచి 1.90 లక్షల క్యూబిక్‌ మీటర్ల వరకు మట్టి తొలగింపు చేసిన త్రివేణి సంస్థ ప్రస్తుతం రోజుకు కేవలం 90 వేల  క్యూబిక్‌ మీటర్ల మేర మాత్రమే పనులు చేస్తోంది. స్పిల్‌ చానల్‌ పనులు కూడా నామమాత్రంగా జరుగుతున్నాయి. బ్లాస్టింగ్‌లు చేసే కొన్ని సంస్థలు సైతం బకాయిలు చెల్లించకపోవటంతో పనులు వదిలి వెళ్లిపోయాయి. 
లక్ష్యాల్ని చేరటం కష్టమే
ఈ ఏడాది ప్రస్తుత సీజ న్‌ (జనవరి నుంచి జూ న్‌ వరకు)లో ప్రాజెక్ట్‌ పనులు నిర్దేశించిన లక్ష్యాలను చేరటం కష్టంగా కనబడుతోంది. స్పిల్‌ వే నిర్మాణానికి సంబంధించి 52 బ్లాక్‌లలో కాంక్రీట్‌ పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 4 బ్లాక్‌లకు సంబంధించిన పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 4 బ్లాక్‌ల పనులు జరుగుతున్నాయి. డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి సంబం ధించి 139 కొలను (పాండ్స్‌) పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 39 పనులు పూర్తయ్యాయి. 669 మీటర్ల పొడవున పనులు చేయాల్సి ఉండగా, 206 మీటర్ల మేర పూర్తయ్యాయి. ఇవి కూడా నామమాత్రంగా జరుగుతున్నాయి. ఇక 10.80 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి తొలగించాల్సి ఉండగా.. 3.60 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పనులు పడకేశాయి. వర్షాలు లేని సమయంలో మాత్రమే ఈ పనులు చేపట్టాల్సి ఉంది. మహా అయితే, జూ న్‌ నెలాఖరు వరకు ఈ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈలోగా లక్ష్యం మేరకు మట్టి తొలగించే అవకాశం కనిపించడం లేదు. ఇటీవల డీజిల్‌ లేదనే సాకుతో నాలుగు రోజులపాటు మట్టి తొలగింపు పనులను పూర్తిగా నిలిపివేసిన విషయం విదితమే. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సీజ న్‌లో నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తయ్యే అవకాశం లేదని పోలవరం ప్రాజెక్ట్‌ ఇంజినీరింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement