విమానాశ్రయం నిర్మిస్తే అడ్డుకుంటాం
♦ ఎమ్మెల్యే సున్నం రాజయ్య
♦ పునుకుడుచెలక గ్రామాన్ని
♦ సందర్శించిన సీపీఎం బృందం
కొత్తగూడెం రూరల్: పునుకుడు చెలక గ్రామంలోని ఆదివాసీల భూముల్లో విమానాశ్రయం నిర్మిస్తే అడ్డుకుంటామని...ఈ విషయంపై అసెంబ్లీలో చర్చిస్తామని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. మంగళవారం కొత్తగూడెం మండల పరిధిలోని పునుకుడు చెలక గ్రామంలో విమానాశ్రయం నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే సున్నం రాజయ్యతో పాటు, సీపీఎం బృందం మంగళవారం సందర్శించారు. తొలుత ఆదివాసీలతో వారు మాట్లాడారు.
అనంతరం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అడవిలోని భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీల భూములలో విమానాశ్రయం నిర్మిస్తే ఉద్యమం చేపడుతామన్నారు. అన్నం పెట్టే ఆదివాసీల భూములలో విమానాశ్రయం నిర్మిస్తే సహించమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పొతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ ఆదివాసీలకు భూములు తీసుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు.
భూములను సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నా ఆదివాసీల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య, జిల్లా నాయకులు గుగులోత్ ధర్మా, అన్నవరపు సత్యనారాయణ, అన్నవరపు కనకయ్య, ఎం జ్యోతి, కున్సోత్ ధర్మా, భూక్య రమేష్, ఇట్టి వెంకటరావు, జాటోతు కృష్ణ, ఆదివాసీ సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ జేఏసీ కొత్తగూడెం డివిజన్ అధ్యక్షుడు పాయం పోతయ్య తదితరులు పాల్గొన్నారు.