‘అక్ను’ రాష్ట్రంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయం
‘అక్ను’ రాష్ట్రంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయం
Published Wed, Apr 19 2017 10:42 PM | Last Updated on Tue, Jun 4 2019 6:45 PM
యూజీసీ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాం
నేడు, రేపు యూజీసీ కమిటీ పర్యటన
‘అక్ను’ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ముత్యాలనాయుడు
రాయవరం : ఆది కవి నన్నయ యూనివర్సిటీ రాష్ట్రంలోనే అతి పెద్ద విశ్వ విద్యాలయమని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ముర్రు ముత్యాలనాయుడు తెలిపారు. రాయవరంలో ఏర్పాటు చేసిన తెలుగుతల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘అక్ను’ పరిధిలో 460 కళాశాలలు ఉన్నాయని, ఈ కళాశాలల్లో 1.25 లక్షల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నట్టు తెలిపారు. 2006లో యూనివర్సిటీ ప్రారంభించే సమయానికి 21 కోర్సులు ఉండగా, ప్రస్తుతం 36 కోర్సులు ఉన్నట్టు తెలిపారు. ఏటా కొత్త కోర్సుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో సీపీఏ(అమెరికన్ కోర్సు), ఫోర్స్‌నిక్ సైన్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. యూనివర్సిటీలో లేని కోర్సులు డిగ్రీ కళాశాలల్లో పెడుతున్నట్లు ఆయన తెలిపారు.
45.28కోట్లు మంజూరు..
యూనివర్సిటీ ప్రారంభంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క పైసా కూడా రాలేదన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూనివర్సిటీకి వచ్చిన సందర్భంగా రూ.45.28కోట్లు విడుదల చేశారన్నారు. ఆ నిధులతో నూతన భవన నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామన్నారు. యూనివర్సిటీకి 115 ఎకరాలు కేటాయించగా, ఇప్పటి వరకు 95 ఎకరాలు అప్పగించారని, ఇంకా 20 ఎకరాలు అప్పగించాల్సి ఉందన్నారు.
నేడు, రేపు యూజీసీ కమిటీ పర్యటన..
‘అక్ను’ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గురు, శుక్రవారాల్లో సందర్శిస్తున్నట్టు వైస్ ఛాన్‌సలర్ ముత్యాలనాయుడు తెలిపారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా యూనివర్సిటీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. యూజీసీ కమిటీ యూనివర్సిటీకి ఉన్న భవన సముదాయం, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. యూజీసీ కమిటీ సానుకూలమైన నివేదిక ఇస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
12బీ గుర్తింపుతోనే నన్నయ ప్రగతి
రాజ రాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీకి 12బీ గుర్తింపు లభిస్తేనే త్వరితగతిన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద యూనివర్సిటీగా ఉన్న నన్నయ అభివృద్ధి ఇంతకాలం నామమాత్రంగానే జరిగిందన్నారు. గురు, శుక్రవారాల్లో యూజీసీ కమిటీ జిల్లాకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం యూనివర్సిటీలో ఉన్న వివిధ సదుపాయాల ఆధారంగా 12బీ అనుమతి ఇస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయన్నారు.
Advertisement
Advertisement