అన్ని దారులూ అటువైపే
- నోట్ల కొరత ఇంతింత కాదయా..
- సరిపడునంత నగదు నిల్వలు లేవు
- బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూ
- జాతరను తలపిస్తున్న వైనం
అనంతపురం అర్బన్ : పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రం వాటి స్థానంలో కొత్త కరెన్సీని సమకూర్చలేకపోయింది. రిజర్వ్ బ్యాంకు నుంచి అరకొరగా వస్తున్న నగదును అన్ని బ్యాంకులూ పంచుకుని ఖాతాదారులకు తలా కొంత పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే అవసరాలకు తగినంత నగదు అందకపోవడంతో జనం ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. ఈ నెల పదకొండో తేదీ వచ్చిన రూ.90 కోట్ల నగదుతోనే బ్యాంకులు, ఏటీఎంలకు కేటాయించి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బుధవారం నాటికి జిల్లా వ్యాప్తంగా నగదు నిల్వలు తగ్గిపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. విత్ డ్రా పరిమితి రూ.2వేల నుంచి రూ.4వేలకు మించడం లేదు. ఏది కొనుగోలు చేయాలన్నా నగదు అవసరమవుతోంది. నగదు రహిత లావాదేవీలు జరిపి నోట్ల కష్టాల నుంచి బయటపడవచ్చని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా స్వైపింగ్ మిషన్లు ఎక్కడా లేవు. చేసేది లేక ప్రజలు నగదుతోనే లావాదేవీలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతపురంలో నగదు కోసం ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల వద్దకు ఉదయం 7 గంటల నుంచే చేరుకున్నారు. మరికొందరు ఏటీఎంలు ఎక్కడతెరిచారో, ఎక్కడ నగదు వస్తోందో అన్వేషించి మరీ అక్కడకు వాలిపోతున్నారు. ఎన్ని పనులు ఉన్నా అన్నింటినీ మానుకుని, నగదు పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం ఓపికను కూడగట్టుకుని మరీ గంటల తరబడి క్యూలోనే నిల్చుంటున్నారు. కొన్ని చోట్ల ఏటీఎంలు తెరిచినా అందులో నగదు లేకపోవడం, స్టేట్‌మెంట్లు చూసుకునేందుకు పేపర్ రోల్ కూడా ఉంచకపోవడంతో జనం ఉసూరుమంటూ వెనుదిరిగారు. గురువారం నగదు వచ్చే అవకాశం ఉందని, అయితే ఎంత మొత్తం అనే సమాచారం లేదని బ్యాంకర్లు తెలిపారు.
లోన్ బిల్లులు కూడా తీసుకోవడం లేదు : పుష్పవల్లి, జూనియర్ అసిస్టెంట్, అనంతపురం
డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నామో మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఇక బిల్లులు కూడా తీసుకోవడం లేదు. లోన్‌కి సంబంధించిన బిల్లులకు మూడు రోజులుగా తిరుగుతున్నాను. బ్యాంక్‌లోకి వెళ్లనీయడం లేదు. ఉద్యోగానికి సెలవుపెట్టి రావాల్సి వస్తోంది.
మాటల్లో చెప్పలేని ఇబ్బంది : కీర్తి, గృహిణి, సోమనాథ్ నగర్, అనంతపురం
బ్యాంకులు, ఏటీఎం చుట్టు తిరుగుతున్నా కనీసం అవసరానికి సరిపడా నగదు అందడం లేదు. మా ఇబ్బందుల్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఉదయం 8.30 గంటలకు వచ్చి లైన్‌లో నిల్చొని ఏటీఎంలో వచ్చే రూ.2 వేలు తీసుకుంటున్నాం. ఈ రోజు బ్యాంక్‌లోనూ రూ.2 వేలు ఇచ్చారు. ఇంటి అవసరాలకు చాలా కష్టంగా ఉంది.