ఇండోర్ స్టేడియంలో ఉడెన్‌కోర్టు పనులను పర్యవేక్షిస్తున్న బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు సూరిబాబు, రత్నాజీ
– నేడు, రేపు జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు
– ఏర్పాట్లు పూర్తి చేసిన బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు
శ్రీకాకుళం న్యూకాలనీ: బ్యాడ్మింటన్ పోటీలకు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి ఇండోర్ స్టేడియం వేదికగా శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జరగనున్న జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నారు. దీని కోసమే కొద్దిరోజులుగా ఇండోర్ స్టేడియంలోని ఉడెన్ కోర్టుల పనులను నిర్వహిస్తున్నారు. ఆ పనులు శుక్రవారానికి పూర్తయ్యాయి. సాయంత్రం సంఘ కోశాధికారి ఎం.ఇ.రత్నాజీ నేతృత్వంలో తుది మెరుగులు దిద్దారు. ఇండోర్ స్టేడియంను కూడా నేలమట్టం చేయనున్న నేప«థ్యంలో జరగనున్న ఆఖరి టోర్నీ కావడంతో బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు మౌలిక సదుపాయాలతోపాటు భోజన ఏర్పాట్లను కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాడ్మింటన్ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.సూరిబాబు తెలిపారు.
ఐదు విభాగాల్లో పోటీలు...
రెండు రోజులపాటు జరగనున్న జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీల్లో మొత్తం ఐదు విభాగాలు ఉన్నాయి. అండర్–13, అండర్–15 బాలబాలికలకు, సీనియర్స్(పురుషులు, మహిళలు), 45ప్లస్, 55ప్లస్ వయస్సు కలిగిన వారికి వేరువేరుగా ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగిల్స్, డబుల్స్‌లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఆదివారం సాయంత్రం బహుమతులు అందిస్తారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు రాష్ట్రపోటీలకు అర్హత సాధించనున్నారు. ఎంట్రీలను నమోదుచేసుకున్న క్రీడాకారులంతా శనివారం ఉదయం 9 గంటలకు చేరుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
అంతా సహకరించాలి..
జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇండోర్ స్టేడియం నేలమట్టం చేయనున్న నేపథ్యంలో శ్రీకాకుళంలో జరగనున్న ఆఖరి పోటీలను అంతా విజయవంతం చేయాలి. సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారుంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
–కిల్లంశెట్టి సాగర్, ఏపీ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘ సంయుక్త కార్యదర్శి