సమస్య తీర్చమంటే బెదిరింపులు
► పీఎస్‌లోనే బెదిరించినట్లు కౌన్సిలర్‌పై ఆరోపణ
► మంత్రి కేటీఆర్‌కు బాధితుడు లేఖ
సిరిసిల్ల క్రైం: సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సిన నాయకులు ప్రతివాదులుగా మారి పార్టీ పరువు బజారుకీడుస్తున్న సంఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకటి తర్వాత మరొకటి వెలుగులోకి వస్తున్నాయి. మొన్న మున్సిపల్‌లో వాటాలు కుదరకపోవడంతో వాట్సప్‌లో పంపకాల పర్వంతో పరువు తీసుకున్న కౌన్సిలర్లు మళ్లీ వివాదాల్లోనే కొనసాగుతున్నారు. అప్పుడు ఆర్థిక లావాదేవీల వివాదంలో కేంద్రబిందువులుగా ఉన్నవాళ్లు ఇప్పుటు భార్యభర్తల గొడవల్లో తలదూర్చారు. దీంతో ఓ నేతకార్మికుడు చావే శరమణ్యమంటూ మంత్రి కేటీఆర్‌కు స్వయంగా లేఖ రాశాడు.
బాధితుడి వివరాల ప్రకారం.. గోపాల్‌నగర్‌కు చెందిన ప్రసాద్ నేతకార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈయన మొదటి భార్యకు సంతానం కలుగలేదు. దీంతో తమ్ముడి పిల్లలను దత్తత తీసుకుందామని నిర్ణయించుకున్నాడు. భార్య నిరాకరించడంతో తాను పని చేసే చోటే మరో మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు బాబు జన్మించాడు. ఇదే సమయానికి మొదటి భార్య గర్భవతి అని తెలిసింది. దీంతో కుటుంబంలో పలు సమస్యలు రావడంతో చిన్న భార్య చెప్పకుండా పుట్టింటికి వెళ్లింది.
ప్రసాద్ పలుమార్లు ఆమె ఇంటికి రావడానికి ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ విషయంలో విడాకులు కావాలని రెండో భార్య స్థానిక కౌన్సిలర్‌తో చెప్పింది. పోలీస్ స్టేషన్‌లో ఈ సమస్య పరిష్కరించడానికి సదరు కౌన్సిలర్ ఠాణాకు పిలిపించారు. ఠాణాలో కౌన్సిలింగ్ నిర్వహించే ప్రాంతానికి వచ్చిన కౌన్సిలర్ దుర్భాషలాడుతూ, భార్యను ఇంటికి రామ్మంటే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ప్రసాద్ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు, జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
బెదిరించలేదు
భార్యభర్తల మధ్య గొడవకు సంబంధించిన ఫిర్యాదు ఠాణాలో ఉంది. వాళ్ల సమస్యను తీర్చేందుకు పెద్దమనిషిగా నా వద్దకు వచ్చారు. మార్కండేయ గుడిలో పంచాయితీ చేయడానికి నిర్ణయించారు. కానీ ఇరువర్గాల వాళ్లు రాలేదు. నేను పోలీస్‌స్టేషన్‌లో ఎలా బెదిరిస్తాను.
- యెల్ల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్, సిరిసిల్ల
అలాంటి ఫిర్యాదు రాలేదు...
భార్యభర్తలకు సంబంధించిన ఫిర్యాదు రాలేదు. కుటుంబ సమస్యలుంటే దానిని కౌన్సిలింగ్‌తో పరిష్కరిస్తామే తప్ప ఇతరులను చూడమని చెప్పే అవకాశం లేదు. - సీహెచ్ శ్రీనివాస్‌రావు, సీఐ, సిరిసిల్ల