ఇన్నర్ రింగ్ రోడ్ రూటే వేరు.. | Amaravathi Inner Ring Road takes new dimensions for leaders benefits | Sakshi
Sakshi News home page

ఇన్నర్ రింగ్ రోడ్ రూటే వేరు..

Published Fri, Jan 15 2016 3:05 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM

ఇన్నర్ రింగ్ రోడ్ రూటే వేరు.. - Sakshi

ఇన్నర్ రింగ్ రోడ్ రూటే వేరు..

► అమరావతి, విజయవాడ చుట్టూ ప్రభుత్వ ప్రతిపాదన
► స్వప్రయోజనకోసమంటూ స్థానికుల విమర్శలు
►  మొదటి రింగ్‌రోడ్ వద్దే ప్రతిపాదిత
► ఐఆర్‌ఆర్ కలుస్తున్న వైనం
►  పదే పదే భూములు కోల్పోతున్నామని స్థానికుల ఆవేదన
 
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, విజయవాడ:
నూతన రాజధాని అమరావతిలో ప్రతిపాదించిన ‘ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్)’ ఆదిలోనే అష్టవంకర్లూ తిరుగుతోంది. నూతన రాజధానిని కలుపుతూ విజయవాడ చుట్టూ ఏర్పాటు చేస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిత స్థలాల ఎంపికలో స్వప్రయోజనాలు ఉన్నాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నుంచి విజయవాడ చుట్టూ తిప్పి గుంటూరు జిల్లాలోని కొంత ప్రాంతాన్ని కలుపుతూ తిరిగి అమరావతి వరకు 75 మీటర్ల వెడల్పుతో నిర్మించే 85 కిలోమీటర్ల ఈ రింగ్‌రోడ్డును అమరావతి మ్యాప్‌లో ప్రతిపాదించారు.

ఈ మధ్యనే సింగపూర్ సంస్థలు సుర్భానా, జురాంగ్ రూపొందించిన పర్‌స్పెక్టివ్ ప్లాన్, క్యాపిటల్ సిటి మాస్టర్ ప్లాన్‌లను సీఆర్‌డీఏ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాప్ ఇన్నర్ రింగ్‌రోడ్‌ను పరిశీలించిన స్థానికులు ప్రస్తుతం ఉన్న ఇన్నర్ రింగ్‌రోడ్డులోనే రామవరప్పాడు వద్ద కొత్తది కూడా కలవడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. విజయవాడ నగరం విస్తురిస్తుందనే విషయాన్ని విస్మరించి ఈ మ్యాప్‌ను రూపొందించారని మండిపడుతున్నారు. ముప్పయ్యేళ్ల కిందట ‘వీజీటీఎం- ఉడా’, నాలుగేళ్ల కిందట ఎన్‌హెచ్‌ఎఐ అధ్యయనం చేసిన వాటిని  కూడా పట్టించుకోకుండా తాజా ప్రతిపాదనలను ఎలా రూపొందించారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
 
నేతల స్వప్రయోజనం?
రెండు ఇన్నర్ రింగ్‌రోడ్లు ఒకే ప్రాంతంలో కలపడం వెనుక అధికారపార్టీ నేతల స్వప్రయోజనం ఉందనేది స్థానికుల వాదన. ఒక రింగ్‌రోడ్డు రామవరప్పాడు వద్ద కలుస్తున్నప్పుడు రెండో రింగ్‌రోడ్డును ప్రసాదంపాడు వద్ద కలిపితే ప్రయోజనకరంగా ఉండేదని వారు చెబుతున్నారు. రామవరప్పాడు రింగ్‌రోడ్డుకు సమీపంలో ఒక దినపత్రిక కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. దాని ముందు భాగం నుంచి రామవరప్పాడులో కలుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గొల్లపూడి బైపాస్ వద్ద ప్రస్తుత ఇన్నర్ రింగ్‌రోడ్డుకు, ప్రతిపాదిత ఇన్నర్ రింగ్‌రోడ్డుకు మధ్య ఆరు కిలోమీటర్ల వరకు దూరం ఉంది.

రామవరప్పాడు సమీపానికి వచ్చేసరికి ఒకటిన్నర కిలోమీటరు దూరం మాత్రమే ఉంది. ప్రారంభంలో ఎంత దూరం ఉందో అంతే దూరంతో ఐదో నంబరు జాతీయ రహదారిలో కలిపితే బాగుండేదని, ఎవరి స్వార్థం కోసమో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదనేది పలువురి వాదన. ఇప్పటికే ఇన్నర్ రింగ్‌రోడ్డు కోసం కొంత భూమిని తీసుకున్నారు. మెట్రో ప్రాజెక్టు కోసం నిడమానూరులో 60 ఎకరాలు డిపోకు తీసుకుంటున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఇప్పటికే కొంత భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు మరో ఇన్నర్ రింగ్‌రోడ్డు పేరుతో మరికొంత భూమి పోనుంది. ఎవరి కోసమో తాము బలికావాల్సి వస్తోందని భూములు కోల్పోతున్న వారు వాపోతున్నారు.

ఎక్కడ నుంచి ఎక్కడకు..
కృష్ణా నదిని ఆనుకుని గుంటూరు జిల్లా పరిధిలో వైకుంఠపురం, పెద్దమద్దూరు, కర్లపూడి, మోతడక, నిడుముక్కల, తాడికొండ, కంతేరు మీదుగా ఐఆర్‌ఆర్ జాతీయ రహదారిలో కలుస్తుంది. అక్కడి నుంచి చినవడ్లపూడి మీదుగా నదిని దాటి కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తుంది. ఈ విషయాన్నీ అధికారికంగా చూపలేదు. ఆ తరువాత రోడ్డు ఎక్కడనే ప్రశ్నకు సమాచారం  కరువవుతోంది.

విశ్వసనీయ సమాచారం మేరకు... తాడిగడప-ఎనికేపాడు మధ్య ఉన్న 100 అడుగుల రోడ్డుకు ఐఆర్‌ఆర్‌ను కలపాలనేది ప్రతిపాదన. అక్కడి నుంచి వీజీటీఎం-ఉడా హయాంలో మొదలైన రామవరప్పాడు రింగ్ వద్ద నిర్మాణంలోని ఐఆర్‌ఆర్‌కు కలిపి గొల్లపూడి వరకు తీసుకువెళ్లాలనేది ఆలోచన. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఇంతకన్నా అశాస్త్రీయ, అసంబద్ధత మరొకటి ఉండదనేది నిపుణుల అభిప్రాయం. బెజవాడ ఇక అభివృద్ధి చెందదు అనే ఉద్దేశంతోనే ఐఆర్‌ఆర్ ప్రతిపాదనలు ఉన్నట్లు వారు చెబుతున్నారు. అందజేసిన విషయం తెలిసిందే. అయితే అనుభవమున్న ప్రణాళికాకర్తలు, ఉన్నతాధికారులు కూడా ప్రణాళికల్లోని లోపాలను పట్టించుకోకపోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement