సాక్షి, ఢిల్లీ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ స్కాం కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులో సీఐడీ పేర్కొంది. ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో ఉన్న లోకేష్‌ను కలిసి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు తీసుకుని విచారణలో అధికారులకు సహకరించాలని లోకేష్‌ని ఏపీ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
నోటీసులు ఇచ్చిన అధికారుల బృందంలో మధుసూదన్‌రావు, బై జోహన్ సైదా, జగత్ సింగ్ ఉన్నారు. తనకు ముందుగానే వాట్సాప్‌లో నోటీసులు అందాయని లోకేష్ చెప్పగా, అయితే తాము ప్రత్యక్షంగా ఇచ్చేందుకు వచ్చామని సీఐడీ అధికారులు తెలిపారు. 41ఏ నోటీస్ ఫార్మాట్‌పై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేయగా, అది రెగ్యులర్‌గా ఇచ్చే ఫార్మాట్ అని సీఐడీ స్పష్టం చేసింది. నారా లోకేష్‌పై 120బీ, 409, 420, 34, 35, 36, 37,166,167,217 ఐపీసీ 13(1),13(2) సెక్షన్ల కింద కేసు నమోదైంది.
నోటీసుల్లో 10 అంశాలు..
నోటీసుల్లో 10 అంశాలను సీఐడీ పేర్కొంది. హెరిటేజ్ సంస్థ బ్యాంక్ వివరాలు తీసుకురావాలన్న సీఐడీ.. హెరిటేజ్ బోర్డు మినిట్స్ కూడా సమర్పించాలని పేర్కొంది. హెరిటేజ్ కొనుగోలు చేసిన భూములకు చెల్లింపు లావాదేవీల వివరాలను సీఐడీ అడిగింది.
కాగా, అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ డిజైన్ల ముసుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు సాగించిన భూదోపిడీపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి పొంగూరు నారాయణ, చంద్రబాబు సన్నిహితులు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీ కుమార్ తదితరులను నిందితులుగా చేర్చింది.చంద్రబాబు కుమారుడు, అప్పటి మంత్రి లోకేశ్‌ను సైతం 14వ నిందితునిగా చేర్చింది.
క్విడ్‌ప్రోకో ద్వారా..
టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ ఖరారు పేరిట జరిగిన భూ దోపిడీలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ కీలక పాత్ర పోషించినట్లు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చెబుతోంది. ఈమేరకు ఈ కేసులో లోకేశ్‌ను ఏ–14గా చేర్చినట్లు న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో పేర్కొంది. ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ పేరిట చంద్రబాబు, లోకేశ్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని, తద్వారా తమ కుటుంబానికే చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు, లింగమనేని కుటుంబానికి చెందిన భూముల విలువ అమాంతం పెరిగేలా అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది.
సొంత కంపెనీకి భూములు
టీడీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబు అధికారిక నివాసంలోనే తనయుడు లోకేశ్ కూడా నివసించారు. రాజధాని ఎక్కడ నిర్మిస్తారన్నది ముందుగానే తెలియడంతో తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ముందుగానే భూముల కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఇక లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారు. అందులో భాగంగా అమరావతిలో భూములు పొందారు. 2014 జులై 1న 7.21 ఎకరాలను కొనుగోలు చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం 2014 జులై 7న ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించారు. లింగమనేని రమేశ్ కుటుంబ సభ్యుల నుంచి 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఆ విషయం బయటకు పొక్కడంతో ఆ 4.55 ఎకరాలకు సేల్ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నారు. ఆపై అధికారులపై ఒత్తిడి తెచ్చి లింగమనేని, హెరిటేజ్ ఫుడ్స్ భూములకు దూరంగా వెళుతున్న ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మార్పించారు. లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్ భూములను ఆనుకొని ఐఆర్‌ఆర్ వెళ్లేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు.
చదవండి: వామ్మో చినబాబు.. రింగ్‌రోడ్డులో ఎన్ని మలుపులో!
Comments
Please login to add a commentAdd a comment