
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి
ఆర్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రెండు వందల శాతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిపై అంత శ్రద్ధ చూపుతున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీయస్)వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలకు ఆర్థికంగా సాయపడిన వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఓ సామాజిక వర్గానికి దోచిపెట్టేందుకు ప్రభుత్వం ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతోందన్నారు. రైతుల భూములు లాక్కొని హడావుడి చేస్తున్న ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్యలు తీసుకోకుండా శంకుస్థాపనకు హాజరుకావడం శోచనీయమన్నారు.
బుధవారం జిల్లా కేంద్రం కర్నూలులో అమరావతి శంకుస్థాపనను నిరసిస్తూ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఎదుట రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బెరైడ్డి మాట్లాడుతూ రాయలసీమలో ఏర్పాటు కావాల్సిన రాజధానిని విజయవాడకు తరలించారన్నారు.