
ఆన్‌లైన్ మోసం
ములుగు: ఏ వస్తువైనా సరే ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే చాలు, కొద్ది గంటల్లోనే పార్సల్ ఇంటికి వస్తుందని ఎదురు చూసే కస్టమర్లను మిడిల్ మేనేజర్లు మోసం చేస్తున్నారు. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కు కూడా ఈ బాధ తప్పటంలేదు. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం నల్లగుంటలో మంగళవారం చోటుచేసుకున్న ఘటనలో అమెజాన్ యాప్ ద్వారా ప్రాడక్ట్ ఆర్డర్ చేసిన వ్యక్తికి ఖాళీ పార్సల్ వచ్చింది.
గ్రామానికి చెందిన జనగాం రవి అనే యువకుడు అమెజాన్ ఆప్‌లో రూ.315 విలువ గల మెమోరీ కార్డును ఆన్‌లైన్‌లో బుక్ చేశాడు. కంపెనీ పంపించిన పార్శిల్ తో కొరియర్ బాయ్ మంగళవారం రవి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో రవి లేకపోవటంతో అతని సోదరుడు బాబురావు రూ. 315 చెల్లించి పార్శిల్ తీసుకున్నాడు.
కొరియర్ బాయ్, స్థానికుల ముందే ఆ పార్శిల్ తెరిచి చూడగా అందులో మెమోరీ కార్డు లేకుండా ఖాళీ కవర్ మాత్రమే ఉంది. దీంతో బాబురావు కొరియర్ బాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మెమోరీ కార్డు ఇచ్చేదాక ఇక్కడి నుంచి కదలనివ్వమని నిలువరించాడు. చివరకు బాయ్ తమ సంస్థ ఉన్నత సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి బాబురావుకు రూ.315 తిరిగి అందించాడు. నాణ్యమైన వస్తువు లభిస్తుందని ఆర్డర్ ఇస్తే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని స్థానికులు విస్తుపోయూరు. సంబంధిత అధికారులు స్పందించి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.