అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
గుడివాడ టౌన్ : ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి మరోసారి అవమానం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత, దళిత నేత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం దుండగుల చేతుల్లో ధ్వంసమైంది. రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.
ఎమ్మెల్యే కొడాలి నాని ఖండన..
భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్య్రాలతో జీవిస్తున్నామంటే అది డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ ఫలమేనని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు అన్నివేళల్లో అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా వెంకట రమణ (బాబ్జి) మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఆయనను అవమాన పరిచామనుకుంటే భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానపరచినట్లేనన్నారు. ఈ విధమైన చర్యలకు స్వస్తి పలకాలని ఆయన హితవుపలికారు. ఎమ్మెల్యే నానితో పాటు కౌన్సిలర్ గొర్ల శ్రీను, కో–ఆప్షన్ సభ్యుడు సర్ధార్‌బేగ్, వైఎస్సార్ సీపీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఖర్చులతో విగ్రహం నిర్మిస్తాం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయ డం నీచమైన చర్యని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సంఘటన స్థలం వద్ద దళిత సంఘాల నాయకులు, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తదితరులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ మున్సిపల్ నిధులతో ఇక్కడే భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత సంఘాల నాయకులు, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భారీ ర్యాలీ
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ దళిత నాయకులు, పలు పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు శనివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నుంచి నెహ్రూచౌక్ వరకు దోషులను శిక్షించాలి, నిందితులను అరెస్టు చేయాలి, జోహార్ అంబేడ్కర్ అంటూ ర్యాలీ కొనసాగింది. స్థానిక నెహ్రూచౌక్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.
నిందితులను త్వరలో పట్టుకుంటాం
సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ అంకినీడు ప్రసాద్ మాట్లాడుతూ ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్యని నిందితులు ఎంతటి వారైనా సాధ్యమైనంత త్వరలో పట్టుకుని అరెస్టు చేస్తామన్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్‌ను తీసుకువచ్చామని, అది సంఘటన సమీపంలోని కొన్ని స్థలాల్లో సంచరించిందని తెలిపారు. తమకున్న సమాచారంతో నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.