అంపశయ్యపై అంబులెన్స్‌లు
అంపశయ్యపై అంబులెన్స్‌లు
Published Sat, Oct 1 2016 10:04 PM | Last Updated on Sat, Aug 18 2018 2:15 PM
* మొరాయించిన సీఎం కాన్వాయ్‌కు కేటాయించిన అంబులెన్స్
* జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
* అల్లాడుతున్న రోగులు
గుంటూరు మెడికల్: సీఎం చంద్రబాబు నివాసం వద్దకు శుక్రవారం రాత్రి కాన్వాయ్ డ్యూటీలు నిర్వహించేందుకు గుంటూరు జీజీహెచ్ నుంచి వైద్యులు, వైద్య సిబ్బంది అంబులెన్సులో వెళ్లారు. విధులు ముగించుకుని శనివారం ఉదయం 9 గంటల సమయంలో తాడేపల్లి నుంచి గుంటూరు వస్తుండగా, అంబులెన్సు ఇంజన్ ఆయిల్ కారిపోతూ వడ్డేశ్వరం వద్ద ఆగిపోయింది. దీంతో అంబులెన్సులో ఉన్న ముగ్గురు వైద్యులు, ఇద్దరు టెక్నీషియన్లు, ఒక నాల్గో తరగతి ఉద్యోగి బస్సులో గుంటూరు వచ్చారు. ఆసుపత్రి అధికారులకు అంబులెన్స్ ఆగిపోయిన విషయం తెలియజేయడంతో వారు మరో ఇద్దరు డ్రైవర్లను పంపారు. వారు మరమ్మతులు చేసినా కదలకపోవడంతో ఆస్పత్రికి తాడు కట్టుకుని తీసుకొచ్చారు. మళ్లీ శనివారం రాత్రి కాన్వాయ్ విధులకు ఇబ్బంది లేకుండా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబులెన్సును తీసుకొచ్చి జీజీహెచ్ సిబ్బందిని, వైద్యులను సీఎం నివాసం వద్దకు పంపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాడేపల్లిలో నివాసం ఉంటున్నప్పటి నుంచి ప్రతి రోజూ ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, రాత్రి వేళల్లో గుంటూరు జీజీహెచ్ వైద్యులు కాన్వాయ్ విధులకు వెళుతున్నారు. అంబులెన్స్‌లు సక్రమంగా లేకపోవడంతో వీరికి ఇబ్బందులు తప్పడం లేదు.
ఏడు వాహనాలున్నా నిరుపయోగమే..
ఆసుపత్రిలో అంబులెన్సులు ఏడు ఉన్నప్పటికీ ఒక్కటీ పని చేయడం లేదు. శనివారం ఆగిపోయిన అంబులెన్సును ఏడేళ్ల క్రితం జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి జీజీహెచ్‌కు రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పంపించింది. రాజధాని ఆసుపత్రి గుంటూరులో అంబులెన్సులు లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌లకు తీసుకెళ్లేందుకు రోగులు ప్రైవేటు వాహనాదారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆసుపత్రి అధికారులు ఇప్పటికైనా అంబులెన్సులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Advertisement
Advertisement