
ఇవిగో.. ‘యాదాద్రి’ భవనాలు!
► 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అవసరం
► నాలుగైదు చోట్ల ప్రభుత్వ స్థలాల గుర్తింపు
► అన్ని వివరాలతో 20న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక
భువనగిరి కేంద్రంగా నూతనంగా ఏర్పాటయ్యే యాదాద్రి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి భవనాలు, స్థల గుర్తింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. సమగ్ర వివరాలతో నివేదికను సిద్ధం చేశారు. - భువనగిరి
భువనగిరి : భువనగిరి కేంద్రంగా నూతనంగా ఏర్పాటవుతున్న యాదాద్రి జిల్లాకు ఇప్పటికిప్పుడు అవసరమైన కార్యాలయాలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నూతన జిల్లాలు దసరా నుంచి ఏర్పాటుకానున్న నేపథ్యంలో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన పక్కాభవనాల వివరాలను అధికారులు గుర్తించారు. సుమారు 60 నుంచి 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను, 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించి సీఎంకు సమర్పించడానికి నివేదికను సిద్ధం చేశారు. అన్ని కార్యాలయాల ఏర్పాటుకు లక్ష అడుగుల భవనాలు అవసరం ఉన్నా సర్దుబాటు చేసే విధంగా అధికారులు భవనాలను గుర్తించారు. సోమవారం నాడు సీఎం కేసీఆర్‌తో జిల్లా కలెక్టర్ సమావేశం ఉన్నందున ఈ మేరకు సమగ్ర వివరాలతో నివేదికను సిద్ధంచేసి ఉంచారు.
ఇప్పటికిప్పుడు జిల్లా ఏర్పాటు జరిగినా..
ఇప్పటికిప్పుడు జిల్లా కేంద్రమైతే అవసరమైన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అసరమైన భవనాలను అధికారులు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ భవానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసి కలెక్టర్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయంలో సీఈఓ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కార్యాలయం ఇలా పలు శాఖల భవనాల్లో ఆయా శాఖల జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ఇండోర్ స్టేడియంలో మూడు వేల అడుగులు, టీటీడీ కల్యాణమంటపంలో 4వేల చదరపు అడుగులు, పాత సీసీ బ్యాంకు అవరణలో2500 చదరపు అడుగులు, మీనానగర్ గ్రంథాలయంలో 1800 చదరపు అడుగులు, సింగన్నగూడెం ప్రభుత్వ కమ్యునిటీహాల్‌లో 1000 చదరపు అడుగులు, మీసేవ భవనం మొదటి అంతస్తులో 1500 చదరపు అడుగులు, ఆర్‌ఆండ్‌బీ ఈఈ క్యాంపు కార్యాలయంలో 1000 చదరపు అడుగులు, సమ్మద్ చౌరస్తా, అర్బన్‌కాలనీ, సంజీవనగర్, హౌసింగ్‌బోర్డులలోని కమ్యూనిటీ హాల్‌లు, అనంతారంలోన డ్యామా కార్యాలయాల్లో 40 వేల చదరపు అడుగుల స్థలా న్ని అధికారులు గుర్తిం చారు. దీంతోపాటు ప్రస్తుతం కార్యాలయం కొనసాగుతున్న ఎంపీడీ ఓ, పశుసంవర్థకశాఖ ఏ డీ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని స్రీశక్తి భవనం, కొత్త మున్సిపల్ కార్యాలయం పూర్తి చేసి పాత భవనాల్లో 20 వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. దీంతో పాటు వర్తకసంఘ భవనం, ధర్మశాల పైభాగంలోని మీటింగ్ హాల్,రైల్వేగేట్ సమీపంలోని 10,000 చదరపు అడుగుల ప్రభుత్వ భవనంతోపాటు నూతనంగా నిర్మించిన మరో 20 ప్రైవేట్ వ్యక్తుల భవనాలను గుర్తించారు.
అందుబాటులో మరిన్ని కార్యాలయాలు..
అధికారులు గుర్తించిన భవనాలతోపాటు ప్రస్తుతం కొనసాగుతున్న డివిజన్‌స్థాయి కార్యాలయాలు జిల్లాస్థాయి కార్యాలయాల ఏర్పాటుకు అనుకూలం గా ఉన్నాయి. ఆర్డీఓ కార్యాలయం, ఆర్డీఓ బంగ్లా, డీఎస్పీ కార్యాలయం, డీఎస్పీబంగ్లాలు ఉన్నత స్థాయి కార్యాలయాలకు ఉపయోగపడతాయి. జాతీయ రహదారి పక్కన ఉన్న రహదారి బంగ్లా, ఆర్‌ఆండ్‌బీ కార్యాలయం, పశుసంవర్థక శాఖ కార్యాలయం, కోఆపరేటివ్ బ్యాంకు కార్యాలయం, పట్టణపోలీస్ స్టేషన్, నీటిపారుదల శాఖకార్యాలయం, కోర్టు భవనాల సముదాయం, జూనియర్ కళాశాల సముదాయం, తహసీల్దార్‌కార్యాయం,ఎంపీడీఓ కార్యాలయాల ఆవరణలో సుమారు 50 ఎకరాల స్థలం అందుబాటులోకి వస్తుంది.
30 ఎకరాలు ఒకేచోట..
భవనగిరిని జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి ఒకే చోట 30 ఎకరాల స్థలం ఉండాలని సీఎం చెప్పడంతో అధికారులు ఆ దిశగాస్థలాన్ని గుర్తించారు. గతంలో దిల్ సంస్థలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం రద్దు చేసి స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు జాతీయ రహదారి బైపాస్ పక్కన ఐటీఐ సమీపంలో గల ప్రభుత్వ స్థలం.. ఇలా నాలుగైదు ప్రతిపాదనలుసిద్ధం చేశారు. వీటికి సంబంధించిన నివేదికను సీఎం కేసీఆర్ ముందు పెట్టనున్నారు.