దళిత వృద్ధులకు ఆనంద నిలయాలు
దళిత వృద్ధులకు ఆనంద నిలయాలు
Published Wed, Apr 5 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM
- 14న 700 ఎకరాల భూ పంపిణీ
- సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు
- డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
కర్నూలు(అర్బన్): దళిత వృద్ధుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద నిలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలను బుధవారం.. స్థానిక ఐదు రోడ్ల కూడలిలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ రూ.1,56,990 కోట్లు అయితే.. సాంఘిక సంక్షేమానికి రూ.3,692 కోట్లు, ఎస్‌సీల ఆర్థికాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించామన్నారు.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హులైన దళిత విద్యార్థులకు రూ.10 లక్షలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఎన్‌టీఆర్ విద్యోన్నతి పథకంలో భాగంగా ఉపకార వేతనాలు అందిస్తున్నామని వివరించారు. ఎస్‌సీలకు 50 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులను సాంఘిక సంక్షేమశాఖ చెల్లిస్తున్నదని చెప్పారు. దళిత కౌలు రైతులకు వ్యవసాయ పనిముట్లపై 50 నుంచి 70 శాతం సబ్సిడీ అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని భూమి లేని దళితులకు ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా 700 ఎకరాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం : ఎంపీ బుట్టా రేణుక
జిల్లాలో పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్య కొంత మేర పరిష్కారం అవుతుందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. మహానేతల జయంతి, వర్ధంతి సభల్లో ఒక మంచి కార్యక్రమంపై తీర్మానం చేసి ఏడాది కల్లా పూర్తి చేయగలిగితే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు కొనసాగుతున్నాయని.. ఇవి పూర్తయితే రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కర్నూలు అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.
జగ్జీవన్‌రామ్‌ను స్ఫూర్తిగా తీసుకుందాం: హఫీజ్‌ఖాన్
జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వైఎస్సార్‌సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ హఫీజ్‌ఖాన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విద్య, ఉపాధి రంగాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు ఎస్‌వీ మోహన్‌రెడ్డి, వై.ఐజయ్య, గౌరు చరితారెడ్డి, ఎం. మణిగాంధీ, ఎస్‌పీ ఆకె రవికృష్ణ, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ప్రకాష్‌రాజు, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం. సుధాకర్‌బాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎస్‌సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మద్దయ్య , వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ ...
మెప్మా ఆధ్వర్యంలోని మహిళా గ్రూపులకు రూ.5 కోట్లు, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోని మహిళా గ్రూపులకు రూ.50 కోట్ల చెక్కులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి అందజేశారు.
Advertisement
Advertisement