అదే రచ్చ.. మరో చిచ్చు
అదే రచ్చ.. మరో చిచ్చు
Published Wed, Jan 11 2017 11:20 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
ఎమ్మెల్సీ వెర్సెస్ ఎమ్మెల్యే
అనపర్తి ‘దేశం’లో ఆగని వర్గపోరు
తెలుగు మహిళకు అవమానం
మూడునెలలైనా లభించని సారీ!
తాజాగా ఆమె భర్త అరెస్ట్
‘బాబు’ కోర్టులో బంతి
సాక్షిప్రతినిధి, కాకినాడ : అనపర్తిలో తెలుగుదేశం పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ నియోజకవర్గంలో తెలుగు మహిళకు అవమానం జరిగి మూడు నెలలైనా ఎమ్మెల్యే ఆమెకు క్షమాపణ చెప్పిస్తానన్న మాట నిలబెట్టుకోకపోవడం కేడర్‌లో అసంతృప్తిని పెంచుతోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు అనపర్తి రచ్చ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లినా పట్టించుకోలేదు. ఫలితంగా అక్కడ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(రాము) మరింత ఒంటెత్తు పోకడలతో పార్టీలో చిచ్చురేపుతున్నారని కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ మాగంటి మురళీమోహన్‌పై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు బాహాటంగానే తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఇప్పటికే వర్గ విభేదాలతో అనపర్తిలో సతమతమవుతున్న పార్టీని ఆ ఇద్దరూ మరింత భ్రష్టుపట్టిస్తున్నారని పార్టీ కేడర్ మండిపడుతోంది. వారి వైఖరితో పార్టీ ప్రజల్లో మరింత పలచనైపోయిందంటున్నారు.
ఎమ్మెల్యేపై కేడర్ గుర్రు
పెదపూడి పంచాయతీలో పెట్రోలుబంకు విస్తరణకు పంచాయతీ తీర్మానం విషయంలో పార్టీ మండల కన్వీనర్ మార్నీడి రాంబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో ఎంపీటీసీ గుణ్ణం వనితను అవమానించారు. మార్నీడితో క్షమాపణ చెప్పిస్తానని మాట ఇచ్చి మూడు నెలలైనా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ముఖం చాటేశారంటున్నారు. ఆవిర్భావం నుంచి ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు వర్గంగా ఉండటమే ఆమె చేసిన పాపమా అని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ వర్గ రాజకీయాలు పెంచి పోషిస్తుండబట్టే నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన సీనియర్‌లు టీడీపీకి దూరమైపోతున్నారని ద్వితీయశ్రేణి మండిపడుతోంది. రంగంపేట మండలం మర్రిపూడిలో ఎమ్మెల్యే ఏకపక్ష విధానాలపై విసుగెత్తిపోయిన సీనియర్లంతా గత ఏడాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
దూరం పెంచిన ఫ్లెక్సీ వివాదం
అనపర్తి జెడ్పీటీసీ కర్రి దొరబాబు వర్గం ఎమ్మెల్యేతో ఎడమొహం పెడమొహంగా ఉంటోంది. ఎమ్మెల్యే తీరు నచ్చకున్నా దొరబాబు సీనియర్ల మాట కొట్టేయలేక అంటీముట్టనట్టు ఉంటున్నారు. గత ఏడాది నియోజకవర్గంలో జరిగిన ఒక అధికార కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రాముకు అక్కడ దొరబాబు పేరిట పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆగ్రహం రప్పించింది. కార్యక్రమం అనంతరం ఆయన దొరబాబునుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వీరిద్దరి మధ్య విభేదాలను మరింత పెంచాయి. అనపర్తిలో సొంత సామాజికవర్గ జెడ్పీటీసీని దూరం పెడుతోన్న రాము చివరకు ఎమ్మెల్సీ భాస్కరరామారావుతో కూడా ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ పెద్దాడలో పీహెచ్‌సీ భవన శంకుస్థాపనకు వచ్చిన ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ సమక్షంలో కత్తులు దూసిన సంగతి విదితమే. ఎమ్మెల్యే వర్గానికి చెందిన బొడ్డు సత్తిరాజు ఇంటికి అల్పాహారం కోసం వెళ్లబోయిన మంత్రి శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ అడ్డంపడటంతో అప్పట్లో వీరిద్దరూ బజారున పడ్డారు.
క్షమాపణ కోరితే మరింత అవమానం!
తాజాగా పెదపూడి జన్మభూమిలో మార్నీడితో తనకు క్షమాపణ చెప్పించాలని ఎంపీటీసీ వనిత ఎమ్మెల్యే, ఎంపీలకు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోకుండా వెళ్లిపోవడమే కాకుండా వనిత భర్తను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అవమానించారు. దీనిపై వనిత సహా ఎమ్మెల్సీ భాస్కరరామారావు పెదపూడి పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగడం తెలిసిందే. తనకు జరిగిన అవమానంపై ఎమ్మెల్యేకు మొరబెట్టుకున్నా న్యాయం జరగకపోగా ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే తన భర్తను అవమానించారని వనిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఇదేనా న్యాయం అని ఆమె నిలదీస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో అన్ని తానే అన్నట్టు చక్రం తిప్పిన బొడ్డు భాస్కరరామారావు పార్టీని వీడి తిరిగి రావడంతో ఆయన హవా తగ్గింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తరచు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుతో పార్టీకి సీనియర్‌లు, ముఖ్యనేతలు ఒకరొకరుగా దూరమవుతున్నారు. వనిత భర్తను ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సుతోనే అదుపులోకి తీసుకున్నారని సోమవారం రాత్రి పెదపూడి స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టిన వనితకు భాస్కరరామారావు మద్ధతుగా నిలిచారు. ఈ పరిణామాన్ని భాస్కరరామారావు జీర్ణించుకోలేక ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా వద్ద ప్రకటించడం గమనార్హం. గతంలో రెండు పర్యాయాలు కూడా ఇదేరకంగా వీరిద్దరి మధ్య నెలకొన్న వైషమ్యాలు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లాయి. కానీ వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి యత్నించిన దాఖలాలు కనిపించలేదు.
Advertisement
Advertisement