రాష్ట్రంలో అరాచక పాలన
రాష్ట్రంలో అరాచక పాలన
Published Tue, Mar 14 2017 11:56 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో
వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు
- కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
కోడుమూరు రూరల్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచక పాలన సాగిస్తోందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి.. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి లద్దగిరిలో కోట్లను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్‌ఆర్‌సీపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టీడీపీ హయాంలో రాయలసీమకు.. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఆ పార్టీ నాయకుల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుందన్నారు. ఎల్‌ఎల్‌సీ, జీడీపీ ఆయకట్టుకు సకాలంలో నీరందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హంద్రీ నది ఎండిపోయి పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నా నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతిస్తున్నట్లు చెప్పారు. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టులో రాయలసీమకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వ పాలన అవినీతిమయంగా మారిందని.. మంత్రులు తమ స్వలాభం చూసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారన్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న టీడీపీ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ తరపున బరిలోని గౌరు వెంకటరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Advertisement