అనంతపురం జిల్లా ఉప్పరపల్లి గ్రామంలో ఇటీవల బయటపడిన బంగారు నాణేలు విజయనగర రాజుల కాలం నాటివని చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాఖ అధికారులు తేల్చారు.
- 'ఉప్పరపల్లి' బంగారు నాణేలపై పురావస్తుశాఖ అధికారుల నిర్ధారణ
- 16వ శతాబ్దంలో అరవీడు వంశస్తులు వీటిని వాడారని వెల్లడి
అనంతపురం : అనంతపురం జిల్లా ఉప్పరపల్లి గ్రామంలో ఇటీవల బయటపడిన బంగారు నాణేలు విజయనగర రాజుల కాలం నాటివని చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాఖ అధికారులు తేల్చారు. 16వ శతాబ్ధానికి చెందిన అరవీడు వంశస్తులు ఈ తరహా నాణేలు వాడారని తెలిపారు. ప్రధానంగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అరవీడు వంశస్తుడైన మూడో శ్రీరంగరాయల కాలంలో ఈ తరహా నాణేలు అధికంగా వాడకంలో ఉన్నాయని చరిత్రాత్మక ఆధారాలతో చెప్తున్నారు.
'సుమారు 52.9 గ్రెయిన్స్ (గ్రాముకన్నా తక్కువ) బరువుగల ఈ నాణేలకు ఒక వైపు వేంకటేశ్వరుడు నిలబడిన విధంగా, మరోవైపు దిగువ భాగాన 'శ్రీవేంకటేశ్వరాయ నమః' అని దేవనాగరి లిపిలో అక్షరాలు కన్పిస్తున్నాయి. ఈ నాణేలు ఇలా బయటపడటం వెనుక అనేక సందేహాలున్నాయి' అని అనంతపురంలోని పురావస్తు మ్యూజియం టెక్నికల్ అసిస్టెంట్ రామసుబ్బారెడ్డి అన్నారు. సాధారణంగా ఇటువంటి నాణేలు బయట పడాలంటే ఆ పరిసర ప్రాంతాలలో చారిత్రక ఆలయాలుగానీ, పురాతన బావులుగానీ, కోటలాంటి ప్రదేశాలుగానీ ఉండాలి. నాణేలు విసిరేసినట్టుగా కాకుండా కుండలలోనో, రాగి పాత్రలలోనో తప్పనిసరిగా ఉంటాయి. ఉప్పరపల్లిలో అలాంటి చిహ్నాలేవీ కనపడకపోవడం మరింత పరిశోధనకు దారి తీస్తోందని వివరించారు.
తమ దృష్టికి వచ్చిన నాణెం 'కాయిన్స్ ఆఫ్ విజయనగర' పుస్తకంలోని వివరాలతో సరిపోలినందున ఇది కచ్చితంగా ఆ కాలానికి చెందినదేనని నిర్ధారించారు. దాదాపు 20 నాణేలు దొరికినట్టు గ్రామస్తులు చెబుతున్నా వాటిని వెంటనే కరిగించేయడం లేదా కెమికల్ క్లీనింగ్ చేయించడం వల్ల చారిత్రక విషయాల పరిశోధన కొంత కష్టంగా మారే అవకాశముందన్నారు.