
ఏపీలో వరద నష్టం రూ.6,750 కోట్లు
గత నెలలో వచ్చిన తుపాన్లు, భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో దాదాపు రూ.6,750 కోట్ల మేర నష్టం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు.
అమలాపురం: గత నెలలో వచ్చిన తుపాన్లు, భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో దాదాపు రూ.6,750 కోట్ల మేర నష్టం ఏర్పడిందని, కేంద్ర ప్రభుత్వాన్ని రూ.3,750 వేల కోట్ల తక్షణ సాయం కోరామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తుపాన్లు, వర్షాల వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకూ 81 మంది మృతి చెందారని, 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చినరాజప్ప తెలిపారు. పంటలు, చెరువులకు గండ్లువంటి వాటికి సంబంధించి రూ.3,750 కోట్లు, రోడ్లు, భవనాలు తదితర రంగాలకు రూ.3 వేల కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. కేంద్రం బృందం ఇప్పటికే పంటనష్టాలను పరిశీలించిందన్నారు. పంట నష్టాల అంచనాలకు బృందాలను రంగంలోకి దింపుతున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టాలు; ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంట నష్టాలు ఎక్కువగా జరిగాయని వివరించారు. నెల్లూరు జిల్లాలో తెగిపోయిన జాతీయ రహదారి, ఇతర రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు.
చెన్నైలో తెలుగు ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక బృందాలు
వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న చెన్నైలో తెలుగువారిని కాపాడేందుకు రాష్ట్రం నుంచి ప్రత్యేక బృందాలను పంపించామన్నారు. రాష్ట్రంలోని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల్లో కొన్నింటిని ఇప్పటికే చెన్నై తరలించామన్నారు. కాగా, తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర విపత్తుల నివారణ శాఖ కమిషనర్ ధనంజయరెడ్డితో రాజప్ప ఫోనులో సమీక్షించారు. నెల్లూరు జిల్లా పరిస్థితులపై ఆరా తీశారు. చెన్నైలోని తెలుగువారి రక్షణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.