ఇటు ఏడిపించి.. అటు సీమంతాలు | andhra pradesh ignore anganwadi workers | Sakshi
Sakshi News home page

ఇటు ఏడిపించి.. అటు సీమంతాలు

Published Sun, Nov 29 2015 8:51 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

andhra pradesh ignore anganwadi workers

సాక్షి, విజయవాడ బ్యూరో: అంగన్‌వాడీ ఉద్యోగులపై కనికరం లేకుండా వ్యవహరించి చిత్రహింసలు పెడుతున్న ప్రభుత్వం వారితోనే సీమంతాలు చేయిస్తూ మహిళలను ఉద్ధరిస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతోంది. రాష్ట్రంలో ఉన్న గర్భిణులందరికీ సీమంతాలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులను గుర్తించి వారికి చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఈ పనిని అందులో పనిచేసే వర్కర్లకే అప్పగించినా ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదు.

స్థానికంగానే దాతలు, స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించి ఈ నెల 15నుంచి 31వ తేదీ లోపు సీమంతాలు చేయించాలని ఆదేశించింది. దీంతో అంగన్‌వాడీ వర్కర్లు కాళ్లకు బలపం కట్టుకుని దాతల చుట్టూ తిరిగి బతిమిలాడి సీమంతాలు చేయిస్తున్నారు. రాష్ట్రంలోని 52వేల అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో సుమారు మూడు లక్షల మంది గర్భిణులు ఉన్నట్లు అంచనా వేశారు. వీరందరికీ సీమంతాలు చేయించడం అంగన్‌వాడీ వర్కర్లకు పెద్ద పనిగా మారింది.

విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం 600 మంది గర్భిణులకు సామూహికంగా సీమంతాలు చేశారు. విశాఖపట్నంలోని చోడవరం కమ్యూనిటీ ఆస్పత్రిలో 20 మంది గర్భిణులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు దగ్గరుండి సీమంతాలు చేయించారు. ప్రస్తుతం ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా సీమంతాల హడావుడి పెద్దఎత్తున నడుస్తోంది.

మూడు నెలలుగా జీతాల్లేవు...
గర్భిణులను సంతోషపెట్టే పేరుతో సీమంతాల హడావుడి చేస్తున్న ప్రభుత్వం వారిని కనిపెట్టుకుని ఉంటున్న అంగన్‌వాడీ వర్కర్లకు మాత్రం మూడు నెలలుగా జీతాలివ్వడంలేదు. రాష్ట్రంలో 97వేల మంది అంగన్‌వాడీ వర్కర్లు పనిచేస్తున్నారు. అతి తక్కువ జీతంతో పనిచేస్తున్న తమకు జీతాలు పెంచాలని వారు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ సంవత్సరం ఆగస్టు ఆరో తేదీన జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పెంచిన జీతాలను ఇస్తామని చెప్పింది. కానీ అది ప్రకటనకే పరిమితమవడంతో అంగన్‌వాడీ ఉద్యోగులు కొద్దిరోజుల నుంచి మళ్లీ ఉద్యమబాట పట్టారు. ఆందోళనచేసిన ప్రతిసారి వారిపై ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యాలు చేయించింది.


తాజాగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న అంగన్‌వాడీ ఉద్యోగులపై మగ పోలీసులు తమ ప్రతాపం చూపారు. ఏలూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆందోళన చేస్తున్న ఉద్యోగులను బండబూతులు తిడుతూ అవమానించారు. అయినా ప్రభుత్వం నోరు మెదపడంలేదు. వారికి జీతాలివ్వకపోగా అవి అడిగినందుకు దౌర్జన్యాలు చేయిస్తున్న ప్రభుత్వం సీమంతాలు చేయించే బాధ్యతలు వారికే కట్టబెట్టడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
‘అంగవాడీలపై దమనకాండ సిగ్గుచేటు’
సాక్షి,హైదరాబాద్: అంగన్‌వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అమానుషంగా ఉందని పీడీఎఫ్ పక్షనేత ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం అన్నారు.ఉద్యమాలను క్రూర నిర్భందకాండతో అణచి వేయాలనుకోవడం ప్రభుత్వానికి తగదని స్పష్టం చేశారు. జీతాలు పెంచుతామని 4 నెలలు గడిచినా ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. టీడీపీకి అనుకూలంగా అంగన్‌వాడీ సంఘాలుండాలని ప్రభుత్వ ఉద్దేశంగా కన్పిస్తోందన్నారు. ప్రభుత్వం తన వ్యతిరేకవైఖరిని మానుకోని వెంటనే జీతాలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement