హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో గత నెల 31న కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా జరిగిన ఆందోళనలో ప్రభుత్వ ఆస్తుల నష్టం, పోలీసులపై, పోలీసు స్టేషన్పై దాడుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం పేర్కొంది. గత నెల 30న నెల్లూరులో పోలీస్ స్టేషన్, ఎస్పీ, ఇతర పోలీసులపై దాడుల ఘటనలను తాము ఖండిస్తున్నామని తెలిపింది. రాజ్యాంగం ప్రకారం తమ హక్కులకు భంగం కలిగిందని భావించినప్పుడు నిరసనలు చేయడానికి, ఉద్యమాలు నడపడానికి చట్టపరిధిలో అవకాశాలు ఉన్నాయి.
అయితే నిరసలు, ఉద్యమాలు నిర్వహించేటప్పుడు బాధ్యతతో, సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుందని సూచించింది. అంతేగాని ప్రజల క్షేమం కోసం నియమించబడ్డ పోలీసులు, పోలీస్ స్టేషన్లపైనా దాడులు చేస్తే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై శాంతి భద్రతలు క్షీణిస్తాయని హెచ్చరించింది. చట్టాన్ని ఎవరూ తమ చేతులలోకి తీసుకోరాదని సూచించింది. ప్రభుత్వ ఆస్తుల నష్టం, పోలీసులపైనా, పోలీస్ స్టేషన్లపైనా దాడులు చేసినా వారిపై కఠినమైన చట్టబద్ధ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ ఉన్నతాధికారులను, ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేస్తోంది.
'పోలీస్ స్టేషన్లపైనా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం'
Published Wed, Feb 3 2016 4:19 PM | Last Updated on Tue, Aug 21 2018 9:06 PM
Advertisement