వండి వార్చింది.. ఒక్క రోజే..
వండి వార్చింది.. ఒక్క రోజే..
Published Mon, Jul 17 2017 4:53 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM
-అసలుకే ఎసరు
- ఆరంభ శూరత్వంగా ‘అన్న అమృతహస్తం’
- రెండు వారాలుగా అందని పౌష్టికాహారం
- గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఇక్కట్లు
- రూ.23.6 కోట్ల బిల్లులు చెల్లించని సర్కారు
- ఇలాగైతే వండి పెట్టేదెలాగని ప్రశ్నిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
- ఏదోలా వండాలంటున్న అధికారులు
‘అన్న అమృతహస్తం’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అసలుకే ఎసరు పెట్టినట్టుంది. ఇప్పటివరకూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నేరుగా ఇళ్లకే పోషకాహార దినుసులను అందించేవారు. వాటిని వారు ఇళ్లవద్దనే వండుకొని తినేవారు. ‘అన్న అమృతహస్తం’ పథకం ఆరంభించాక ఇళ్లకు కాకుండా.. ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పౌష్టికాహారం వండి వారికి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపింది. ఫలితంగా అటు ఇళ్లకు పోషకాహార దినుసులు రాక.. ఇటు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందక.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కట్లు పడుతున్నారు.
మండపేట : ‘అన్న అమృతహస్తం’ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఇచే‍్చందుకు ఉద్దేశించిన ఈ పథకం ఒక్క రోజుతోనే ముగిసిపోయి ఆరంభశూరత్వంగా మిగిలింది. ‘వండి పెట్టేందుకు గిన్నెలు లేవు. కూరగాయలు కొనేందుకు డబ్బులు లేవు. పాత బిల్లుల విడుదల లేదు. ఇలాగైతే ఎలా వండిపెట్టేది?’ అని అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.23.6 కోట్ల మేర బిల్లు బకాయిలున్నట్టు వారు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ పథకాన్ని అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించిన పాలకులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పథకం అమలు మాట ఎలా ఉన్నా నెలవారీ ఇచ్చే పౌష్టికాహారం పంపిణీకే ప్రభుత్వం ఎసరు పెట్టిందని లబ్ధిదారులు మండిపడుతున్నారు.
హడావుడి.. ఒక్క రోజుతో సరి!
జిల్లాలో 5,546 అంగన్‌వాడీ కేంద్రాలుండగా.. వీటిలో 3,46,876 మంది చిన్నారులు, గర్భిణులు 38,281 మంది, బాలింతలు 35,563 మంది ఉన్నారు. చిన్నారులకు కేంద్రాల్లోనే పౌష్టికాహారం అందిస్తుండగా, గర్భిణులు, బాలింతలకు వారానికి నాలుగు గుడ్లు, నెలకు మూడు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, అరలీటరు నూనె చొప్పున ఇప్పటివరకూ పంపిణీ చేసేవారు. ఆ దినుసులను రెండు మూడు రోజుల్లోనే కుటుంబమంతా వినియోగించేస్తున్నారని, ఫలితంగా బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందడం లేదన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో వారికి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే వండి పెట్టాలని, అదనంగా పాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 28 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా, ఇప్పటికే ఏజెన్సీ పరిధిలోని ఎనిమిది ప్రాజెక్టులతో పాటు కోరుకొండ, శంఖవరం, తుని ప్రాజెక్టుల పరిధిలో ఈ విధానం అమలులో ఉంది. దీనినే ఈ నెల 1 నుంచి ‘అన్న అమృతహస్తం’ పేరిట కాకినాడ, రాజమహేంద్రవరం, తాళ్లరేవు, కపిలేశ్వరపురం, కోనసీమ తదితర ప్రాంతాల్లోని 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 3,934 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రారంభించారు.
ఆయా ప్రాజెక్టుల పరిధిలోని 30,304 మంది గర్భిణులు, 25,331 మంది బాలింతలకు ఈ పథకం కింద పౌష్టికాహారం అందించనున్నట్టు పాలకులు ప్రకటించారు. ప్రతి రోజూ అన్నం, గుడ్డు, పాలతోపాటు వారంలో రెండు రోజులు పప్పు, కాయగూరలతో కూర, రెండు రోజులు కాయగూరలతో సాంబారు, రెండు రోజులు ఆకుకూర పప్పు వండి పెడతామని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ పథకం అమలుకు అవసరమైన వంట సామగ్రి, కిరాణా, కూరగాయలు, గ్యాస్, గర్భిణులు, బాలింతలు కూర్చుకునేందుకు వీలుగా కుర్చీలు, టేబుళ్లు తదితర వాటిని అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందజేయలేదు. పైగా నిధులు కూడా కేటాయించ లేదు. పథకం ప్రారంభం సందర్భంగా అధికారుల ఒత్తిళ్లతో తొలి రోజు సొంత ఖర్చులతో వండి పెట్టిన అంగన్‌వాడీ కార్యకర్తలు మరుసటి రోజే చేతులెత్తేశారు. దీంతో అధిక శాతం కేంద్రాల్లో ఈ పథకం అమలు ఒక్క రోజుకే పరిమితమైంది.
అంగన్‌వాడీలకు అన్నీ బకాయిలే..
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రభుత్వం రెండు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. జిల్లాలో ఈ బకాయి సుమారు రూ.12 కోట్లు ఉంది. దీనికితోడు అంగన్‌వాడీ కేంద్రాల అద్దె బకాయిలు దాదాపు రూ.1.8 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. మరోపక్క చిన్నారులకు వండుతున్న పౌష్టికాహారానికిగాను కార్యకర్తలకు దాదాపు రూ.9.8 కోట్ల మేర ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సి ఉంది. మొత్తం అన్నీ కలిపితే బకాయిలు రూ.23.6 కోట్లకు చేరాయి. అయినప్పటికీ ఏదోవిధంగా వండి పెట్టాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రాజెక్టు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ఇప్పటికే పెట్టుబడులు పెట్టి అప్పుల పాలైపోయమని, ఆ బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించకపోతే కొత్తగా వండిపెట్టేదెలాగని అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
నిలిచిపోయిన రేషన్ పంపిణీ
ప్రస్తుత పరిస్థితితో ప్రతి నెలా గర్భిణులు, బాలింతలకు ఇంటికి పంపిణీ చేసే రేషన్ సరఫరా నిలిచిపోయింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సరుకులను ఆయా కేంద్రాల్లోనే ఉంచాలని ప్రాజెక్టు అధికారులు చెబుతుండటంతో.. సరుకులు పంపిణీ చేయడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ‘అన్న అమృతహస్తం’ అమలుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో దూరంగా ఉన్న కేంద్రానికి ఆహారం కోసం గర్భిణులు, బాలింతలు ఎంతవరకూ వస్తారన్నది ప్రశ్నార్థకంగా తయారైంది. సాధారణంగా బాలింతలకు పాత బియ్యంతో అన్నం, గానుగ నూనెతో కూరలు వండుతుంటారు. కాగా కేంద్రాల్లో వంటకు మామూలు బియ్యం, పామాయిల్ నూనె వినియోగిస్తుంటారు. దీనిని బాలింతలు ఎంతవరకు తింటారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పాత బిల్లులు విడుదల చేయాలి
అద్దెలు, జీతాలు, కూరగాయలు, ఇతర ఖర్చులకు సంబంధించి సుమారు రూ.23.6 కోట్ల మేర బకాయిలు విడుదల కావాల్సి ఉంది. వాటిని విడుదల చేయకుండా ఏదోవిధంగా వండి పెట్టాలంటూ అధికారులు ఒత్తిడి చేయడం సరికాదు.
- కె.కృష్ణవేణి, జిల్లా కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
సదుపాయాలు కల్పించాలి
ఇప్పటికే పాత బిల్లులు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం వండి పెట్టేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. వంట సామగ్రి, కూరగాయలను కేంద్రాలకు అందజేయాలి.
- రాణి, అంగన్‌వాడీ కార్యకర్త
Advertisement