సరస్వతీనమస్తుభ్యం..
సరస్వతీనమస్తుభ్యం..
Published Fri, Aug 4 2017 11:39 PM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM
శ్రీసరస్వతీ అమ్మవారిగా పూజలందుకున్న శ్రీవనదుర్గ
మూడో రోజు ఘనంగా శ్రావణమాస జాతర మహోత్సవాలు
అన్నవరం : రత్నగిరిపై జరుగుతున్న శ్రీవనదుర్గ అమ్మవారి శ్రావణమాస జాతర మహోత్సవాల మూడో రోజు శ్రావణశుద్ధ ద్వాదశి శుక్రవారం శ్రీవనదుర్గ అమ్మవారు శ్రీసరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి పూజలందుకున్నారు.
ఉదయం 9.30 గంటలకు శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయంలో రుత్వీకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవగ్రహ జపాలు, లింగార్చన, శ్రీచక్రార్చన, శ్రీ పురుష సూక్త పారాయణలు, మూలమంత్ర జపాలు, సూర్యనమస్కారాలు, సప్తశతీ పారాయణలు, మూలమంత్ర జపాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మూడోరోజు కూడా రుత్వీకులు చండీహోమం కొనసాగించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ప్రసాదాల నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. వేదపండితులు, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, ప్రసాద్, మూర్తి, శ్రీవనదుర్గ అర్చకులు గాడేపల్లి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కిటకిటలాడిన దుర్గాలయాలు
శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ పూజ పర్వదినం సందర్భంగా రత్నగిరి దుర్గామాతలు శ్రీవనదుర్గ, శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయాలను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించి పూజలు చేశారు. దుర్గాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
Advertisement
Advertisement