వ్రతభ్రమణం
వ్రతభ్రమణం
Published Sun, Aug 28 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
‘నీ మొక్కు ఏది అంటే తల చుట్టూ తిప్పి చూపించి నట్టు’గా ఉంది అన్నవరం దేవస్థానం అధికారుల నిర్వాకం. పశ్చిమ రాజగోపురం వద్ద ఉన్న వ్రతాల కౌంటర్‌లో టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు, వ్రత మండపాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వ్రతాల కౌంటర్ ఎదురుగా పెద్ద గేటు ఉంది. భక్తుల రద్దీ తీవ్రంగా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు ఆ గేటు తీయకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. – అన్నవరం
సత్తెన్న వ్రతాల భక్తులకు తప్పని ప్రదక్షిణలు
పశ్చిమ రాజగోపురం వద్ద మూసి ఉంటున్న వ్రత మండపం గేటు
రద్దీ రోజుల్లో అయినా తెరిపించాలనే డిమాండ్
దేవస్థానానికి వాహనాల్లో వచ్చే భక్తులతో పాటు సత్రాల్లో బస చేసే వారు పశ్చిమ రాజగోపురం వద్ద ఆగుతారు. పశ్చిమ రాజగోపురం లోపల వ్రతాలు, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక దర్శనానికి రూ.వంద టిక్కెట్లు కూడా ఆ కౌంటర్‌లో విక్రయిస్తున్నారు. రూ.150, రూ.300 వ్రతాల టిక్కెట్లు కొనుగోలు చేసేవారు కౌంటర్ పక్కనున్న ఆయా వ్రతమండపాల్లో వ్రతాలాచరిస్తున్నారు. రూ.700, రూ. 1,500, రూ.2,000 వ్రతాల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఎండైనా, వానైనా ఆలయం చుట్టూ తిరిగి తూర్పు రాజగోపురం ముందుకు వచ్చి, క్యూలో నిలబడి వ్రత మండపాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వ్రతాల కౌంటర్‌కు ఎదురుగా పెద్ద గేటు ద్వారా ఆయా వ్రతాల టిక్కెట్లు తీసుకున్న వారు వారి మండపాల్లోకి సులభంగా చేరుకోవచ్చు. కానీ ఆ గేటు నిత్యం మూసే ఉంటోంది. గతంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గేటు ద్వారానేవ్రతమండపాల్లోకి అనుమతించేవారు. స్వామి దర్శనం చేయిస్తామని ప్రైవేట్ గైడ్‌లు ఈ గేటు ద్వారా భక్తులను తీసుకొచ్చి, మోసం చేస్తున్నారన్న ఆరోపణలతో ఇందులో ఎవరినీ అనుమతించడం లేదని అధికారులు అంటున్నారు.
మధ్యాహ్నం 12 దాటితే..
కాగా, మధ్యాహ్నం వచ్చే భక్తులకు మరో ఇబ్బంది కూడా ఉంది. 12 దాటితే కౌంటర్‌లో వ్రతాల టిక్కెట్లు అమ్మడం లేదు. సాయంత్రం వరకూ మాత్రం రూ.వంద ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విక్రయిస్తున్నారు. పర్వదినాల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నపుడైనా ఈ గేటు తీస్తే భక్తులకు సౌలభ్యంగా ఉంటోంది. ఈ మార్గంలో గైడ్‌లను అనుమతించవద్దని సెక్యూరిటీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.
Advertisement
Advertisement