♦ త్వరలో మూడో నోటిఫికేషన్ విడుదల
♦ డిపెండెంట్ పోస్టుల భర్తీకీ యాజమాన్యం చర్యలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ నుంచి త్వరలో మూడో ఉద్యోగ నియామక ప్రకటన జారీ కానుంది. సంస్థలో ఖాళీగా ఉన్న 7,147 పోస్టుల్లో 3,518 పోస్టులను బహిరంగ నియామక ప్రకటన ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించిన యాజమాన్యం..ఇప్పటికే 3,244 పోస్టుల భర్తీ కోసం రెండు వేర్వేరు ప్రకటనలు జారీ చేసింది. మూడో విడతగా త్వరలో 274 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో అంతర్గత ప్రకటనల ద్వారా మరో 929 పోస్టులు, డిపెండెంట్ కేటగిరీ కింద 2,700 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటోంది. సింగరేణిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తూ సంస్థ ప్రజాసంబధాల అధికారి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ మార్గదర్శకత్వంలో విజిలెన్స్ విభాగం నిరంతర పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా నియామకాల ప్రక్రియ జరుగుతోందని ఇందులో తెలిపారు.
నవంబర్‌లో నియామక ఉత్తర్వులు..
తొలి రెండు విడుతల్లో 3,244 పోస్టుల భర్తీకి ప్రకటనలు రాగా, ఇప్పటికే 2,045 పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు జరిగాయి. ఇప్పటికే 453 పోస్టులకు ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు జారీ చేయగా, నవంబర్‌లో 811 జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ (జేఎంఈటీ) పోస్టులు, 60 అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) పోస్టులు, 72 అసిస్టెంట్ ఫోర్‌మెన్ (మెకానికల్) పోస్టులకు నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కొన్ని పోస్టులకు విద్యార్హతల విషయంలో చివరి సంవత్సరం కోర్సులు చదువుతున్న అభ్యర్థులకు అవకాశం కల్పించాలనే అంశంపై కోర్టులో ఉన్న వివాదం పరిష్కారం కావాల్సి వుంది. ఆ తర్వాతే మిగిలిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నారు. అంతర్గత అభ్యర్థులకు కేటాయించిన 929 పోస్టుల్లో ఇప్పటి వరకు 769 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ పూర్తైది. డిపెండెంట్ కేటగిరీ కింద సైతం ఇప్పటి వరకు 2,200 మందికి ఉద్యోగాలు కల్పించారు.
మరో 274 సింగరేణి కొలువులు
Published Mon, Nov 2 2015 1:14 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement