
ప్రత్యేక ప్యాకేజీనే తీసుకుందాం
కేంద్రం ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీనే తీసుకోవాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ప్యాకేజీ వద్దని హోదానే కావాలని పట్టుబడితే ఇబ్బందులు...
♦ హోదా కోసం పట్టుబడితే ‘అన్నిరకాల’ ఇబ్బందులు
♦ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: కేంద్రం ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీనే తీసుకోవాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ప్యాకేజీ వద్దని హోదానే కావాలని పట్టుబడితే ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. ప్యాకేజీ తీసుకుంటూనే హోదాకై పోరాడుతామని ప్రజలను నమ్మించాలని నిర్ణయించింది. ప్యాకేజీ వద్దని హోదానే కావాలని, లేదంటే కేంద్రం ఇచ్చిన దానికన్నా ఎక్కువ కావాలని డిమాండ్ చేసినా, పోరాడినా భవిష్యత్‌లో కేంద్రం నుంచి ‘అన్నిరకాల’ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఏపీ మంత్రివర్గ భేటీ అనంతరం బాబు అధ్యక్షతన టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, మంత్రులతో సమన్వయ కమిటీతోపాటు ఎంపిక చేసిన ఎమ్మెల్యేలతో టీడీఎల్పీ వ్యూహ కమిటీ సమావేశం ఉమ్మడిగా జరిగాయి.
ప్యాకేజీ తీసుకుందాం: బాబు
‘‘ప్రత్యేక హోదా కావాలని పార్టీ, ప్రభుత్వ పరంగా మనం కోరుతున్నాం, విపక్షాలు ఇదే విషయైమై తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నాయి. కేంద్రం ప్యాకేజీకే మొగ్గు చూపుతోంది. అరుణ్‌జైట్లీ, వెంకయ్య, సుజనాలు ఇదే అంశంపై చర్చలు జరుపుతున్నారు. మనతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ క్షణంలోనైనా ప్యాకేజీపై ప్రకటన రావచ్చు. హోదాతో సమానమైన ప్యాకేజీ వస్తే సంతోషం. అలాగని హోదాను పక్కన పెట్టామని ప్రజల్లోకి సంకేతాలు వెళితే రాజకీయంగా ఇబ్బంది పడతాం.
హోదాతో సమానమైన ప్యాకేజీ తీసుకుంటూనే హోదా కోసం పట్టుబడతామని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని బాబు సూచించారు. ప్యాకేజీపై ప్రకటన వస్తుందని ఎదురు చూశారు. చివరకు కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు శాసనసభ, మండలి సమావేశాలను మూడు రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుంది.
ప్యాకేజీపై నేడు ప్రకటన?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలు, రాష్ట్ర విభజన నాడు ఇచ్చిన వాగ్దానాల సంకలనంగా కేంద్రం రూపొందించిన ఆర్థిక ప్యాకేజీపై నేడు ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. బుధవారం మధ్యాహ్నం అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు కలిసి సంబంధిత ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.