
పల్స్ సర్వేపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పల్స్ సర్వేపై జిల్లా కలెక్టర్లతో శనివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 20 కొలమానాల ఆధారంగా, రెవిన్యూ శాఖ నోడల్ ఏజెన్సీగా ఈ సర్వే చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ....పదేళ్లకొక్కసారి జనగణన జరుగుతుండగా, ఈ సర్వే అంతకుమించిన తాజా వివరాలతో చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో దళారీ వ్యవస్థను, అవినీతిని నియంత్రించడానికే ఈ సర్వే చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి, కుటుంబ ఆదాయం, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి అన్ని అంశాలను సర్వే ద్వారా తెలుసుకునే అవకాశముంటుందని బాబు చెప్పారు.
వీటితో పాటు రాష్ట్రంలోని భూముల వివరాలు, నేల స్వభావం, పంటల వివరాలు, పెన్షన్స్, స్కాలర్ షిప్స్, రుణాలు వగైరా వివరాలన్నీ పల్స్ సర్వేలో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. ఈ సర్వే గణాంకాలు రాష్ట్ర వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయన్నారు తెలిపారు. ప్రజలందరికీ ఆహార, విద్యుత్, ఇంధన, సమాచార భద్రతకు ఈ సర్వే ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ గణాంకాల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల పనిభారం మరింత తగ్గుతుందని చంద్రబాబు తెలిపారు.
పల్స్ సర్వేను అధికారులు ఒక యాగంలా చేపట్టాలని బాబు సూచించారు. సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుంటే పారదర్శకత ప్రతిఫలిస్తుందన్నారు. స్మార్ట్ పల్స్ సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 వేల బృందాలు పనిచేస్తాయని... ట్యాబ్స్, ఐప్యాడ్స్ ద్వారా సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తామని సీఎం చెప్పారు. ఈ నెల 22 నుంచి పల్స్ సర్వే కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.