సీజీఆర్‌ఎఫ్‌లో నియామకాలు
ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పడిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్) పునర్నిర్మాణానికి తొలి అడుగుపడింది.
సాక్షి,విశాఖపట్నం : ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పడిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్) పునర్నిర్మాణానికి తొలి అడుగుపడింది. శ్రీకాకుళం జిల్లా తాళ్లవలసకు చెందిన దుంపల ధర్మారావును సీజీఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్‌గా నియమించింది. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎం.ఎం.నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మారావు గతంలో జిల్లా సెషన్స్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించి, మార్చి 2015న పదవీ విరమణ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసిమేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సీజీఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్‌గా మూడేళ్ల పాటు ధర్మారావు కొనసాగుతారు. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. సీఎండీ ఎంఎం నాయక్‌ను ఆయన్ని అభినందించారు. ఐదు జిల్లాల్లోని వినియోగదారులెవరైనా సీజీఆర్‌ఎఫ్‌కు రాతపూర్వకంగా విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని, తక్షణమే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ధర్మారావు చెప్పారు. అదే విధంగా సీజీఆర్‌ఎఫ్‌కు స్వతంత్ర సభ్యునిగా ఏపీఈఆర్‌సీ సూచించిన పాండే బాలాజీ ప్రసాద్‌ను సీఎండీ నియమించారు. సీజీఆర్‌ఎఫ్ పునర్మిర్మాణంలో జరిగిన నియామకాల వల్ల ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏపీఈపీడీసీఎల్ అధికారుల విధుల్లో మార్పులు చేశారు.
––––––––––––––––––––––––––––––––––––––––––––––
అధికారి పేరు ప్రస్తుత స్థానం మార్పు తర్వాత స్థానం
––––––––––––––––––––––––––––––––––––––––––––––
ఆర్.శ్రీనివాసరావు చైర్‌పర్సన్ సీజీఎం, క్యాలిటీ కంట్రోల్
పి.ఎస్.కుమార్ అకౌంట్స్ సభ్యుడు సీజీఎం,ఇంటర్నల్‌ఆడిట్
ఎం.వై.కోటేశ్వరరావు లీగల్ సభ్యుడు జీఎం, హెచ్‌ఆర్‌డి–1
కె.బాలాజీ జీఎం,రెవెన్యూ అకౌంట్స్ సభ్యుడు
పి.వి.రమణరావు జీఎం,ఆర్‌ఎ టెక్నికల్ సభ్యుడు
యుకెవి రామకష్ణరాజు జీఎం,హెచ్‌ఆర్‌డి జీఎం,హెచ్‌ఆర్‌డి–2