తాడేపల్లిలో విక్రయిస్తున్న నాణ్యతలేని చీరలు
మీరు తాడేపల్లిలో చీరలు కొంటున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే నాణ్యత లేని చీరలను తీసుకువచ్చి, షోరూమ్ చీరలు అంటూ నమ్మబలికి అమ్మేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
– జాగ్రత్త సుమా!
తాడేపల్లి రూరల్: మీరు తాడేపల్లిలో చీరలు కొంటున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే నాణ్యత లేని చీరలను తీసుకువచ్చి, షోరూమ్ చీరలు అంటూ నమ్మబలికి అమ్మేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తాడేపల్లి, బిట్రగుంట, కప్పరాలతిప్ప, చీరాలకు చెందిన బట్టల దొంగలు గతంలో జోరుగా దుస్తులను అపహరించుకు వెళ్లేవారు. వారి ఆటలు సాగకపోవడంతో తర్వాత ఆ పని మానుకున్నారు. చేతిలో డబ్బులు ఆడకపోవడంతో దొంగలు తమ రూటు మార్చారు. బళ్లారి, కాంచీపురం తదితర ప్రాంతాల నుంచి.. చీకిపోయిన, లోపాలు, చిన్న చిన్న చిరుగులు ఉన్న చీరలు తీసుకువచ్చి మధ్యవర్తుల ద్వారా అమ్మకాలు నిర్వహిస్తున్నారు.
ఇలాంటి చీరలు సీతానగరంలోని పలు ప్రాంతాల్లో, కొత్తూరు రైల్వే బ్రిడ్జి వద్ద, పశువులు ఆసుపత్రి సమీపంలో ఓ ఉద్యోగి విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు సమాచారం. ఇటీవల కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఓ కుటుంబం రూ.లక్ష విలువైన దుస్తులు కొని మోసపోయినట్లు తెలుస్తోంది.
తస్కరించి తీసుకొచ్చి..
తాడేపల్లి, చీరాల, కప్పరాలతిప్ప, బిట్రగుంట తదితర ప్రాంతాలకు చెందిన మహిళా దొంగలు చీరలు, జీన్స్ ప్యాంట్లు, వివిధ కంపెనీల టీ షర్టులు, షర్టులు తీసుకొచ్చి అమ్మేందుకు ఇక్కడి మధ్యవర్తులకు అప్పగించేవారు. అవి మంచి దుస్తులు, నాణ్యత కలవి కావడంతో బాగా గిరాకీ ఉండేది. తక్కువ ధరతో మంచి దుస్తులు దొరుకుతుండటంతో కొనుగోలుదారులూ ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం షాపింగ్ మాళ్లు, దుకాణాల్లో నిఘా వ్యవస్థ బలంగా ఉండటం, పోలీసులు ఎప్పటికప్పుడు దొంగల ఆటలు కట్టించి సొమ్ము రికవరీ చేస్తుండటంతో వారి ఆగడాలకు అడ్డుకట్టపడినట్లయ్యింది.