జాతర పనులు ప్రారంభించండి
► కలెక్టర్ ఆకునూరి మురళి
► వివిధ శాఖల అధికారులతో సమీక్ష
కోల్‌బెల్ట్(భూపాలపల్లి): వచ్చే ఏడాదిలో జరగనునన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర కోసం అవసరమైన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన అధికారులతో సమీక్షిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళి మాట్లాడుతూ జాతర ఏర్పాట్లపై గత నెల 29న రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ.సింగ్‌లు చర్చించి తగిన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. జాతర కోసం ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లు మంజూరయ్యే అవకాశమున్నందున.. ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని సూచించారు.
ఆగస్టులోగా టెండర్ల ప్రక్రియ
జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం గుర్తించిన రహదారుల నిర్మాణం, త్రాగునీరు, మరుగుదొడ్లు, కళ్యాణకట్టలు, కల్వర్టులు తదితర నిర్మాణ పనులకు ఈనెల 20వ తేదీలోగా సాంకేతిక అనుమతులు పొందాలని కలెక్టర్ మురళి అధికారులకు సూచించారు. ఆ వెంటనే ఆగస్టు మొదటి వారంలోగా టెండర్లు పూర్తి చేసుకొని పనులు ప్రారంభించాలన్నారు. అనంతరం రోడ్లు, బారికేడ్లు, వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, సంప్రదాయాలపై ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు. ఇంకా నవంబర్ నుంచే ఆలయాల పరిసరాల్లో పనులు, భక్తుల సందడి ప్రారంభం కానున్నందున రైతులు పంటలకు నష్టం కలగకుండా ఈ ఖరీష్ సీజన్ మూడు నెలల్లోనే దిగుబడి వచ్చే స్వల్ప కాలిక పంటలను పండించాలని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కాగా, చేపట్టాల్సిన పనులపై చర్చించేందుకు బుధవారం మేడారంలో పర్యటించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ అమయ్‌కుమార్, ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు, డీఆర్వో మోహన్‌లాల్, ములుగు డీఎస్పీ దక్షణమూర్తి, సీపీఓ కొమురయ్య, సమ్మక్క–సారలమ్మ ఆలయం ఈఓ రవీందర్ పాల్గొన్నారు.