ధ్రువతార ఆరుద్ర
ఆధునిక సాహితీ వినీలాకాశంలో ఆరుద్ర ఒక ధ్రువతార అని, బహుముఖీన ప్రతిభాశాలి, తెలుగు సాహిత్యానికి దశ, దిశ నిర్దేశం చేసిన మహనీయుల్లో ప్రముఖుడని తెలుగు సాహిత్య పీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ పేర్కొన్నారు. ఆరుద్ర జయంతి సందర్భంగా బుధవారం గోదావరి సింగర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిగట్టుపై ఉన్న ఘంటసాల విగ్రహం వద్ద ఆరుద్ర చిత్రపటాన్ని ఉంచిSసభ్యులు పుష్పాంజలి ఘటించారు.
-
జయంతి సభలో ఆచార్య ఎండ్లూరి
రాజమహేంద్రవరం కల్చరల్ :
ఆధునిక సాహితీ వినీలాకాశంలో ఆరుద్ర ఒక ధ్రువతార అని, బహుముఖీన ప్రతిభాశాలి, తెలుగు సాహిత్యానికి దశ, దిశ నిర్దేశం చేసిన మహనీయుల్లో ప్రముఖుడని తెలుగు సాహిత్య పీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ పేర్కొన్నారు. ఆరుద్ర జయంతి సందర్భంగా బుధవారం గోదావరి సింగర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిగట్టుపై ఉన్న ఘంటసాల విగ్రహం వద్ద ఆరుద్ర చిత్రపటాన్ని ఉంచిSసభ్యులు పుష్పాంజలి ఘటించారు. ముఖ్య అతిథి ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ ఆరుద్ర కవి, విమర్శకుడు, పరిశోధకుడు, సినీగేయ రచయిత అని, అచ్చ తెలుగుతనానికి ప్రతీక ఆరుద్ర సాహిత్యమని పేర్కొన్నారు. ఆరుద్ర గీతాలలో జీవనవేదాంతం, తాత్తి్వకచింతన కనపడతాయంటూ ‘కొండగాలి తిరిగింది’అనే పాటలో ‘ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది’ అనే పదాలను ఉటంకించారు. ఒక విశ్వవిద్యాలయం చేయాల్సిన పనిని ఆయన ఒంటిచేత్తో చేసిన ‘సమగ్రాంధ్ర సాíహిత్య చరిత్ర’కు మించిన పరిశోధన రాలేదని ఎండ్లూరి వివరించారు. ‘నాకు జందెంలేదు, నా భార్యకు తాళి లేదు’అని ఆరుద్ర చెబుతూండేవారన్నారు. ఆరుద్ర మార్క్సిస్టు,నాస్తికుడు అయినా ‘రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా’వంటి భక్తిగీతాలను రచించారని, సంపూర్ణ రామాయణం వంటి సినిమాకు రచనాసహకారం అందించారని వెల్లడించారు. ‘టెక్నిక్‌లేని కవిత్వాన్ని నేను ఊహించుకోలేను’ అని ప్రకటించిన ఆరుద్ర కవనంలో చమత్కారాలకు లోటు లేదన్నారు. ‘నీవెక్కదలుచుకున్న ౖ రెలు ఒక్క జీవికాలం లేటు’ అన్న ఆరుద్ర మాటలు నేటికీ ప్రాధాన్యత కోల్పోలేదన్నారు. ఒకసారి సినీనిర్మాత రామానాయుడితో ఆరుద్ర కారులో వెడుతుండగా ‘ఆరుద్రగారూ!మీకు ఇక్కడ భూములేమైనా ఉన్నాయా?’ అని రామానాయుడు అడిగారని, ఆరుద్ర వెంటనే ‘ఆ కనిపించే రుద్రభూములన్నీ నావే’ అన్నారని ఎండ్లూరి తెలిపారు. అధ్యక్షత వహించిన బ్రౌనుమందిర నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి ఆరుద్రకు తన కుటుంబంతోగల అనుబంధాన్ని తెలియజేశారు. గాయనీగాయకులు ఆరుద్ర రచించిన ‘వేదంలాఘోషించే గోదావరి’గీతాన్ని ఆలపించారు. రాయుడు చంద్రకుమార్, పిరాట్ల శ్రీహరి, శ్రీవల్లి వసుంధర, రాళ్ళపల్లి నీలాద్రి, జీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.