నిరసించిన దళిత సంఘాలు, నేతలు ∙
ఆవుల వధ అనుమానంతో అనాలోచిత దాడి ∙
అమలాపురంలో ధర్నాలు, రాస్తారోకోలు
తమ ఆవులను అపహరించి, గోవధకు పాల్పడుతున్నారన్న అనుమానం వారితో ఓ అమానుషానికి పురిగొల్పింది. తమ చర్మకార వృత్తిలో భాగంగా చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న ఇద్దరి దళిత సోదరులకు గోవుల అపహరణ, వధ అంటగట్టి, అకారణంగా దాడి చేసిన ఘటన జిల్లావ్యాప్తంగా మంగళవారం కలకలం రేకేత్తించింది. జిల్లాలో దళిత సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దళిత నేతలు ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించడమే కాకుండా, నిరసనలు కూడా తెలిపారు.
– అమలాపురం టౌన్/ అమలాపురం రూరల్
అమలాపురం మండలం కామనగరువులో ముగ్గురు రైతులకు చెందిన మూడు ఆవులు కనిపించకుండా పోవటం, వాటిని అమలాపురం పట్టణానికి చెందిన చర్మకారులు మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావు(లాజర్)లే అపహరించి, మాంసం కోసం గో వధకు పాల్పడుతున్నారని నిర్ధారణకు వచ్చారు. అసలు ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకోకుండా చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న వారిపై దాడికి దిగటంతో దాడి చేసిన వారు నిందితులయ్యారు. కామనగరువుకు చెందిన ఉర్రింక నారాయణరావు, కామన దుర్గారావు, రాజులపూడి నరేష్, వాకా ప్రసాద్, వాకా గోపి, రాజులపూడి గంగాధరరావు, అతని కుమారుడితో పాటు మరి కొంతమంది కలిసి దళిత సోదరులపై దాడి చేసిశారంటూ వారిపై కేసులు నమోదయ్యాయి.
పోలీసుల రంగప్రవేశం
ఉప్పలగుప్తం మండలం సూదాపాలెం శ్మశానంలో చనిపోయిన ఆవును చర్మాన్ని వలుస్తున్న దళితులపై దాడి చేసి గాయపరచగానే పోలీసులు రంగప్రవేశం చేశారు. అల్లవరం ఎస్సై డి.ప్రశాంత కుమార్ శ్మశానానికి చేరుకుని, రక్తపు గాయాలతో ఉన్న ఎలీషా, లాజర్, వ్యాన్ డ్రైవర్ సరవపు లక్ష్మణకుమార్‌ను తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోనసీమ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు గంపల దుర్గాప్రసాద్, ఇతర దండోరా నాయకులు సోమవారం అర్ధరాత్రి అమలాపురం ప్రభుత్వాస్పత్రికి వచ్చి ఆందోళన చేశారు. ఢిల్లీలో ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న నిరసనలో ఉన్న ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నా మంగళవారం ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడి, ఈ ఘటనపై నిరసన తెలిపారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, సీపీఐ నాయకుడు కె.సత్తిబాబు, సీపీఎం నాయకుడు ఎం.రాజశేఖర్, బీఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి గెడ్డం సంపదరావు, జిల్లా మానవ హక్కుల వేదిక ప్రతినిధి రవి తదితర దళిత నేతలు అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రితో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, ఈ ఘటనపై నిరసన తెలిపారు. అమలాపురం గడియారం స్తంభం వద్ద కేవీపీఎస్ నేతలు ధర్నా చేశారు.
24 గంటల్లో అరెస్టు చేస్తాం : ఎస్పీ
కాకినాడ సిటీ: అమలాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో చర్మకారులపై దాడి చేసిన వారిని 24 గంటల్లో అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. మంగళవారం రాత్రి ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సంఘటనకు సంబంధించి కొన్ని శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. దీంతో పార్టీలకు, గోసంరక్షణ, ఆర్‌ఎస్‌ఎస్ వంటి సంఘాలకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. కేవలం ఉప్పలగుప్తం మండలం సూదాపాలేనికి చెందిన యువత వారి గ్రామానికి చెందిన ఆవును దొంగిలించి, చర్మం వలుస్తున్నారని ఉద్రిక్తతకు లోనై, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు. సమాచారం అందిన తక్షణమే పటిష్ట చర్యలు తీసుకుని, పోలీసు పికెట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ దాడిలో ఏడుగురు ఉన్నట్టు పేర్లు వచ్చాయని, వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
జిల్లాలో సెక్షన్–30 అమలు
జిల్లావ్యాప్తంగా సెక్ష–30 అమలులో ఉన్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇది ఈ నెల 31 వరకు జిల్లాలోని కాకినాడ, రామచంద్రపురం అమలాపురం, పెద్దాపురం, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్లలో అమలవుతుందని పేర్కొన్నారు.