
పసిపాపపై పైశాచికం!
► ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం
► పోలీసులను ఆశ్రయించిన బాలిక తల్లిదండ్రులు
► గతంలో మైనర్‌పై లైంగిక దాడికేసులో శిక్ష అనుభవించిన ప్రబుద్ధుడు
► కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల డిమాండ్
అభం... శుభం... తెలియని ఆ చిన్నారిని కాటేసేందుకు యత్నించాడో మృగాడు. తోటి చిన్నారులతో ఆడుకుంటున్న ఆ బాలికను ఎత్తుకెళ్లి చెరిచాలనుకున్నాడు ఆ కామాంధుడు. పాపం... ఆ మానవ మృగం వికృత చేష్టలను పంటిబిగువున భరించి ఎలాగోలా అక్కడినుంచి బయటపడింది. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా... ఆ ప్రబుద్ధుడు ఇప్పుడు పరారీలో ఉన్నాడు.
విజయనగరం జిల్లా : పార్వతీపురం పట్టణ శివారున రాయగడ రోడ్డులోగల వివేకానందకాలనీలోని ఉజ్జిడితల్లి వీధిలో నిరుపేద కుటుంబం నివాసం ఉంటోంది. చిన్నపాటి టీకొట్టు నడుపుకుంటూ తమకున్న కుమారుడు, కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం టీ కొట్టు తీసేందుకు వారు వెళ్లిపోగా... వీధిలోని చిన్నారులతో వారి ఐదేళ్ల కుమార్తె ఆడుకుంటోంది. అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉన్న... ఆ పక్క జనతావీధికి చెందిన యాభై ఏళ్ల అన్నాబత్తుల బాబూరావు ఆ పసికందును చిదిమేందుకు యత్నించాడు.
తన ఇంటిలోకి ఎత్తుకెళ్లిపోయాడు. వికృతమైన చేష్టలతో తన కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. ఎలా తప్పించుకుందోగాని. ఆ చాన్నిరి అక్కడినుంచి ఏడ్చుకుంటూ వచ్చి జరిగిన విషయం తల్లికి తెలియజేసింది. కన్నీరు మున్నీరైన ఆ తల్లి భర్తకు సమాచారం అందించగా... వీధిలోని సీపీఎం నాయకుడు బంకురు సూరిబాబుతో పాటు పెద్దలకు విషయం చెప్పారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకొని జరిగిన సంఘటనపై పట్టణ ఎస్సై బి.సురేంద్రనాయుడుకు ఫిర్యాదు చేశారు.
వారికి తోడుగా సీఐటీయూ నాయకుడు జి.వి.సన్యాసి, పట్టణ పౌర సంక్షేమ సంఘ నాయకుడు పాకల సన్యాసి, ఐద్వా నాయకురాలు గెద్ద తులసి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మానవ మృగం బాబూరావును జనజీవనంలో తిరగనివ్వొద్దన్నారు. దీనిపై బాధిత బాలిక కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.
ఐసీడీఎస్ అధికారుల పరామర్శ
సంఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఐసీడీఎస్ సీడీపీఓ కె.విజయగౌరి తన సిబ్బందితో సూపర్‌వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులతో బాధిత బాలిక ఇంటికెళ్లి పరామర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకొన్నారు. టౌన్ ఎస్సైతో మాట్లాడారు. వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.
లైంగిక దాడి కేసులో గతంలోనూ జైలు శిక్ష
గతంలో ఆ కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన బాబూరావు ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటికొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మానవమృగం బాధలు పడలేక తొలి భార్య, రెండో భార్య సైతం వదిలి వెళ్లిపోయారు.