
మృతుడు గౌరీనాథ్ (ఫైల్)
పార్వతీపురం (విజయనగరం జిల్లా) : ఆ యువకుడికి వివాహం కుదిరింది. ఆదివారం ముహూర్తపు రాట .. ఈ నెల 24న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. శనివారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన యువకుడు ఆదివారం సాయంత్రానికి శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందో తెలియడం లేదు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం పురపాలక సంఘ పరిధిలోని 4వ వార్డు తూర్పు వీధికి చెందిన రాజాన గౌరీనాథ్ (32)ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం బ్రాంచిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఈ నెల 24న వివాహం జరిపించడానికి మూహూర్తాలు కూడా తీశారు.
ఇందులో భాగంగా ఆదివారం ముహూర్తపు రాట వేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇంతలో ఏమైందో ఏమో కాని శనివారం రాత్రి నుంచి ఆ యువకుడు కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు సన్యాసిరావు, కన్నమ్మ ఆదివారం ఉదయం తమ కుమారుడు కనిపించలేదంటూ పట్ణణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇంతలో పట్టణ శివారున బెలగాం హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న కల్లాల్లో గుర్తు తెలియని మృతదేహం పడిఉందన్న సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడకు వెళ్లి చూడగా, గౌరీనాథ్ శవమై కనిపించాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.
గౌరీనాథ్ మంచి కుర్రవాడని, రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉంటే పెళ్లికి తయారుచేసిన బంగారు వస్తువులు వేసుకుంటానని గౌరీనాథ్ అడుగగా.. ముహూర్తపు రాట వేసిన తర్వాత ఇస్తానని కుటుంబ సభ్యులు చెప్పినట్లు సమాచారం. ఈ విషయమై మనస్తాపం చెంది గౌరీనాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment