ఆగస్టు 12న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం
ఆగస్టు 12న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం
– ఈ నెల 27నుంచి ఈ–దర్శన్ కౌంటర్లో టికెట్లు
తిరుచానూరు: తిరుచానూరులో కొలువైన శ్రీవారి పట్టపురాణి శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 12వ తేదీన వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరగనుంది. నిండు ముల్తైదువైన అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నోచుకుంటే భక్తులకు అషై్టశ్వరాలు, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తారని నమ్మకం. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందురోజు నిర్వహించే వరలక్ష్మీ వ్రతాన్ని అమ్మవారి సన్నిధిలో చేయడానికి దంపతులు ఆసక్తి చూపుతారు. వ్రతం నోచుకునే భక్తుల కోసం ఈనెల 27వ తేదీ నుంచి ఈ–దర్శన్ కౌంటర్ ద్వారా వరలక్ష్మీ వ్రతం టికెట్లను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. దేశవ్యాప్తంగా 200 టికెట్లను ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచుతుంది. వ్రతంలో పాల్గొనదలచిన దంపతులు గుర్తింపు కార్డుతో పాటు రూ.500 చెల్లించి టికెట్లు కొనుగోలు చేయాలి. వ్రతంలో పాల్గొన్న భక్తులకు అంగవస్త్రం, రవిక, లడ్డూ, వడలను అమ్మవారి ప్రసాదంగా అందించనున్నారు. అదే రోజు సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకు ఆరోజు అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవలను రద్దుచేశారు.