మట్టుబెట్టింది కోడలే.. | august 24 case atta kodalu mystery chased | Sakshi
Sakshi News home page

మట్టుబెట్టింది కోడలే..

Published Thu, Sep 8 2016 12:30 AM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM

మట్టుబెట్టింది కోడలే.. - Sakshi

మట్టుబెట్టింది కోడలే..

నగల కోసం ఆశపడిన కోడలే వదినతో కలిసి నాటకం
మత్తు తీవ్రత వల్ల అత్త చనిపోవడంతో మొత్తం ముగ్గురిపై హత్య కేసు
నిందితులను అరెస్టు చేసి, రూ.7 లక్షల విలువైన సొత్తు రికవరీ చేసిన పోలీసులు

అమలాపురం టౌన్‌(తూర్పు గోదావరి జిల్లా) :
అత్యాశ.. బుల్లితెరలో నేర కథనాలు.. ఆమెలో రాక్షసత్వాన్ని ఉసిగొలిపాయి. నగల కోసం అత్తను మట్టుబెట్టడమే కాకుండా, ఆమె వదిన, మరొకరిని హత్య, చోరీ కేసులో నిందితులను చేసింది. అమలాపురం కూచిమంచి అగ్రహారంలోని గన్నవరపువారివీధిలో ఓ ఇంట్లో గత నెల 24న విద్యుత్‌ మీటరు నమోదు కోసం వచ్చి అత్తా కోడళ్లకు మత్తుమందు ఇచ్చి, రూ.7 లక్షల విలువైన సొత్తు కాజేసినట్టు నమోదైన కేసును పోలీసులు కొత్త కోణంతో ఛేదించారు. ఇదంతా కట్టుకథగా పోలీసులు తేల్చారు.

మత్తుమందు ప్రభావానికి గురయ్యారన్న అత్తాకోడళ్లలో.. కోడలే దీనికి సూత్రధారిగా తేలింది. మత్తు మందు ప్రభావంతో అత్త గన్నవరపు సీతామహలక్ష్మి (84) గత నెల 28న మరణించిన సంగతి తెలిసిందే. కోడలు వెంకట పద్మావతి హైదరాబాద్‌కు చెందిన ఆమె వదిన కందెపు దేవిరెడ్డి, ఈమె ప్రియుడు కందెపు శివకేశవరావుతో కలిసి ఆ కథ అల్లింది. అదికాస్తా అడ్డం తిరగడంతో, ముగ్గురు నిందితులను పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ తన సిబ్బందితో కలిసి రావులపాలెం ఫైనాన్స్‌ ఎదురుగా మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. కేసు వివరాలను అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, సీఐ శ్రీనివాస్‌ స్థానిక పోలీసు స్టేషన్‌లో బుధవారం విలేకరులకు తెలిపారు.
 
కాఫీలో మత్తు మాత్రలు కలిపి..
తన అత్త సీతామహాలక్ష్మి బంగారు నగలు, వెండి వస్తువులను నలుగురు కూతుళ్లకు ఇచ్చేస్తుందని పద్మావతికి అనుమానం వచ్చింది. వాటిని దక్కించుకోవాలని హైదరాబాద్‌లో ఉంటు న్న తన వదిన దేవిరెడ్డితో కలిసి పద్మావతి పథకం రచించింది. ఆమెను, ఆమె ప్రియుడిని హైదరాబాద్‌ నుంచి గత నెల 23న అమలాపురం రప్పించింది. వీరంతా విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌కు వచ్చిన ఆగంతకుడి కథ అల్లారు. ఈ క్రమంలో అమలాపురం వచ్చిన దేవిరెడ్డి, ఆమె ప్రియుడు ఓ లాడ్జిలో దిగారు. అతను లాడ్జిలోనే ఉండగా, దేవిరెడ్డి ఎవరూ గమనించకుండా పద్మావతి ఇంటికి వెళ్లింది. గత నెల 24న ఉదయం 20 మత్తు బిళ్లలను కాఫీలో కలిపి పద్మావతి తన అత్తకు ఇచ్చింది. ఆమె అపస్మారక స్థితిలోకి చేరాక, ఆమె వద్దనున్న నగలు, బీరువాలను పగులగొట్టి, బంగారు, వెండి వస్తువులను ఇద్దరూ కాజేశారు.

ఎవరికీ అనుమానం రాకుండా ఆగంతకుడు తన నగలు కూడా తస్కరించినట్టు పద్మావతి అవి కూడా తీసేసింది. అన్ని నగలను మూటకట్టి దేవిరెడ్డికి ఇచ్చి, అక్కడి నుంచి పంపివేసింది. తర్వాత నగలు పంచుకోవాలనేది వారి ఒప్పందం. పద్మావతి మాత్రం ఓ మత్తుమాత్ర వేసుకుని నిద్రపోతున్నట్టు నటించింది. సాయంత్రం 3.30కు పనిమనిషి వచ్చి, అత్తాకోడళ్లను చూసి కేకలు వేసింది. పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న పద్మావతి భర్త వెంకటరమణమూర్తికి స్థానికులు సమాచారం అందించారు. స్థానికుల సపర్యలతో పద్మావతి కోలుకున్నట్టు నటించింది. మత్తు తీవ్రతతో ఉన్న అత్తను అమలాపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. నగలుతో దేవిరెడ్డి, ఆమె ప్రియుడు అదే రోజు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. నగలను సొమ్ము చేసుకోవాలని ఆడపడుచు, వదిన మరో ప్లాన్‌ వేశారు. తన తండ్రికి అనారోగ్యంగా ఉందంటూ పద్మావతి మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చింది. హైదరాబాద్‌ నుంచి వదిన, ఆమె ప్రియుడు ఇక్కడకు వచ్చారు. వీరు రావులపాలెంలోని ఓ ఫైనాన్స్‌ సంస్థలో నగలు కుదుప పెట్టేందుకు యత్నిస్తుండగా.. వారిపై నిఘా పెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ శ్రీనివాస్, క్రైం పార్టీ హెచ్‌సీ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుళ్లు గుబ్బల శంకర్, శెట్టి రమేష్‌ను డీఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement