ఆటో, మోపెడ్ ఢీ.. వ్యక్తి మృతి
వట్టిఖమ్మంపహాడ్ (చివ్వెంల) : ఆటో, మోపెడ్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మణ్‌నాయక్‌తండా ఆవాసం పందిబండ తండాకు చెందిన గుగులోతు చాంప్లా (40) వృత్తిరీత్యా పశువుల కోనుగోలు చేసి విక్రయిస్తుంటాడు. అయితే ఆదివారం కావడంతో ఇంటి వద్దే ఉన్నాడు. కాగా, సూర్యాపేట చదువుతున్న కుమారుడికి పచ్చడి పెట్టించేందుకు నిమ్మకాయలు తెమ్మని భార్య చెప్పడంతో తన మోపెడ్‌పై వట్టిఖమ్మంపహాడ్‌కు వెళ్లాడు. గ్రామ శివారులోని ఓ నిమ్మ తోటలో కాయలు కోనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో కాకరవాయి నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న ఆటో వట్టిఖమ్మంపహాడ్ శివారులో అతివేగంగా ఢీకొట్టింది. దీంతో చాంప్లా తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ట్రైనీ ఎస్సై బాలరాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.