కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం ఒక్క రూపాయి కూడా అదనంగా సాయం చేయడం లేదని ...
కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం విదిలింపు
అన్నిరాష్ట్రాలకు ఇచ్చినట్టే రాష్ట్రానికీ నిధులు
రూ. 2500 కోట్లతో గొప్ప రాజధాని ఎలా సాధ్యం?
విశాఖపట్నం : కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం ఒక్క రూపాయి కూడా అదనంగా సాయం చేయడం లేదని, దేశంలో మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టే మనకూ నిధులు ఇస్తోందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేసారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మించిన నిధులు ఇచ్చామన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి అయ్యన్న ఘాటుగా స్పందించారు.
విభజన తరువాత అన్యాయానికి గురైన ఏపీని ఎక్కువ నిధులిచ్చి ఆదుకోవాల్సి ఉండగా, బీజేపీ నేతలు టీడీపీ ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర శాఖ సమావేశం తర్వాత ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయని విమర్శించారు. మంగళవారం విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, ఐతేప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడేందుకు ఇది సమయం కాదని అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. టీడీపీ అధికారంలో ఉండబోయే మూడేళ్లలో కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చుకునేందుకు కృషి చేస్తామన్నారు.
ఢిల్లీని మించిని రాజధానిని ఏపీకి నిర్మిస్తామని ప్రధాని నరేంద్రమోదీ రాజ్యసభలో చెప్పారని, ఐతే రూ. 2500 కోట్లతో అలాంటి రాజధానిని నిర్మించడం కష్టమని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే 20 సార్లు ఢిల్లీ వెళ్లి మోదీకి, ఆయన క్యాబినెట్‌లో మంత్రులకు విజ్ఞప్తి చేశారని అయ్యన్న చెప్పారు.